Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు
Telugu States Rains : తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దయ్యాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లంక గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా, కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పట్టణాల్లోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలు జిల్లాల్లో చెరువులు అలుగుపారుతున్నాయి. వరద దాటికి కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. నదుల్లోకి భారీగా వరద నీరు చేరడం జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ధవళేశ్వరం నుంచి సముద్రంలో నీరు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద పెరుగుతోంది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి లక్షా 15 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 9.7 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్దకు వరద పోటెత్తుతోంది. గోదావరికి ఆకస్మిక వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున కోస్తాంధ్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
లంక గ్రామాల్లో అవస్థలు
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడి లంకలో తాత్కాలిక నదీపాయ గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెల వారిపాలెం, పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలకు పడవపైనే ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోయారు. వరద మరింత పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి, ఎదురు బిడియం కాజ్ వేల పైకి నీరు చేరుతుంది.
నిండుకుండలా కృష్ణమ్మ
కృష్ణమ్మ నిండుకుండను తలపిస్తోంది. భారీ వర్షాలకు ఉపనదులు, వాగుల నుంచి నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. సుమారు 15 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. కాగా గంపలగూడెం మండలం వినగడప-తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో విజయవాడ, నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 20 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు.
అలుగుపారుతోన్న వాగులు
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మోర్తాడ్ మండలంలోని పెద్ద వాగు, మొండి వాగు, కప్పల వాగు పొంగి పొర్లుతున్నాయి. భీంగల్ మండలం గోనుగొపుల వద్ద భారీ వర్షానికి తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు భారీగా వస్తోంది. ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు, ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతోంది. కొన్ని చోట్ల పొలం పనులు ఊపందుకున్నాయి.
భాగ్యనగరంలో భారీ వర్షం
హైదరాబాద్ లో శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రామంతపూర్ టీవీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులు నత్తనడక నడవడం వల్లే తమకి ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి చెట్లు విరిగి కరెంట్ పోల్ పడడంతో వైర్లు తెగిపడ్డాయని ఇప్పటివరకు వాటిని పట్టించుకునే అధికారి కరువయ్యాడని ఆరోపిస్తున్నారు. రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామన్న ఎస్ఎన్డీపీ పనులు ఆరు నెలలు గడుస్తున్నా ఎక్కడవి, అక్కడే ఉండడంతో తమకి పరిస్థితి ఏర్పడిందన్నారు.
అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ కాలనీవాసులు ఈ పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పనులు వేగవంతం చేసి రానున్న రోజుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. బేగంపేట్ రసూల్పుర నాల వద్ద పనులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. కొన్ని చోట్ల వాటర్ స్టాక్ లను చూసిన మేయర్ వెంటనే వాటిని క్లియర్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ఎత్తు ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు మేయర్ తెలియజేశారు. సీఆర్ఎంపీ సిబ్బంది వెంటనే వాటిని సరిచేయాలని మేయర్ ఆదేశించారు. మేయర్ తో పాటు డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.