Minister Roja on Pawan Kalyan: రోజుకో పార్టీ మారే పవన్ ను ప్రధాని మోదీ పక్కన పెట్టారు - మంత్రి రోజా
పూటకో స్టేట్ మెంట్, రోజుకో పార్టీతో జత కలుస్తున్న పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ పక్కన పెట్టారని మంత్రి రోజా అన్నారు. పవన్ కల్యాణ్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని విశాఖ పర్యటనలో మోదీకి అర్ధం అయ్యిందన్నారు.
Minister Roja on Pawan Kalyan: దారం తెగిన గాలిపటం ఎటు వెళ్తుందో తెలియనట్లే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ఆయనకే తెలియదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా విమర్శించారు. చిత్తూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన రోజా.. పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూటకో స్టేట్ మెంట్, రోజుకో పార్టీతో జత కలుస్తున్న పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ పక్కన పెట్టారని మంత్రి రోజా అన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నిలబడినా ఒక్క స్థానంలో అయినా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్ కు రాష్ట్రంపై , రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని.. ఇలాంటి వారితో ఏం ఉపయోగం లేదని మోదీ గ్రహించారని రోజా అన్నారు. పవన్ కల్యాణ్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని విశాఖ పర్యటనలో మోదీకి అర్ధం అయ్యిందన్నారు. మీడియా పవన్ ను హైలైట్ చేస్తుంది కానీ.. ప్రజలు ఆయనను ఎప్పుడో మరచిపోయారని చెప్పారు.
కిరణ్ రాయల్ వి అసత్య ఆరోపణలు
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పై తాను ఫిర్యాదు చేశాననే వార్తలో నిజం లేదని అన్నారు. ఆయనతో ఫోన్ లో మాట్లాడాను అన్న విషయం కూడా అబద్ధమేనని రోజా స్పష్టం చేశారు. కిరణ్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం రాయల్ అనే పేరును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. జనసేన పార్టీని కిరణ్ రాయల్ ఉపయోగించుకుంటున్నారే తప్ప.. తన వల్ల ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కిరణ్ తన వద్ద ఏవో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారని... అవేంటో బయటపెడితే తానూ చూస్తానని అన్నారు.
తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం
తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని రోజా స్పష్టంచేశారు. దేవుడి కృపతో, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఏపిఐఐసీ ఛైర్మన్ గా, మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ, వారి కష్టాలను రోజా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా తీరుస్తున్నానని అన్నారు. ఒక లీడర్ గా, ఒక అక్కగా ప్రజల ప్రేమను పొందగలుగుతున్నట్లు ఆమె చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రోజాను మీడియా ముఖంగా తిడితే పబ్లిసిటీ వస్తుందని గ్రహించి ఇలా చేస్తున్నారన్నారు.. తాను తప్పు చేసి ఉంటే, అవినీతికి పాల్పడి ఉంటే ఏ శిక్ష అనుభవించేందుకైనా సిద్ధమని మంత్రి రోజా స్పష్టంచేశారు.
మంత్రి రోజా, కిరణ్ రాయల్ మధ్య ఇదీ వార్
ఏపీ మంత్రి ఆర్కే రోజాకు తిరుపతి జనసేన నాయకులకు మధ్య కొంత కాలంగా వార్ నడుస్తుంది. ఒకరిపై మరొకరు రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి రోజాపై విశాఖపట్నంలో జనసేన నాయకులు జరిపిన దాడి సందర్భంగా వీరి విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 18న మంత్రి ఆర్.కే.రోజా ఫిర్యాదుతో తిరుపతి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై నగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఈనెల 11న కిరణ్ రాయల్ ఇంటి వద్దకు దాదాపు 11 మంది పోలీసులు మఫ్తీలో చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. తాము రేణిగుంటకు చెందిన పోలీసులమని చెప్పి నోటీసు జారీ చేసి కిరణ్ రాయల్ ను వాహనంలో ఎక్కించుకుని తిరుపతి మొత్తం తిప్పి రోజాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళలో నగిరి పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు ఐపీసీ 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.