Viral News: కారు, బస్సు కాదు.. వ్యక్తి ప్రాణాల్ని కాపాడేందుకు వెనక్కి వెళ్లిన రైలు, ఏపీలో ఘటన
Andhra Pradesh News | రైలు నుంచి జారిపడిన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వెనక్కి వెళ్లిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో చోటుచేసుకుంది. కానీ ఆ వ్యక్తి చనిపోయాడు.

Markapuram Tragedy | మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైలు నుంచి జారిపడిన ఓ ప్రయాణికుడిని కాపాడేందుకు కొండవీడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 1.5 కిలోమీటర్లు వెనక్కు ప్రయాణించింది. ఈ ఘటన సోమవారం రాత్రి గజ్జలకొండ-మార్కాపురం రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
రైలు నుంచి జారిపడిన ప్యాసింజర్
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన కమలకంటి హరిబాబు (35) తమ మిత్రులు మావోబాబు, వెంకటేశ్వర్లు, విమలరాజుతో కలిసి యలహంకకు భవన నిర్మాణ పనుల కోసం వెళ్తున్నారు. వీరంతా సోమవారం సాయంత్రం గుంటూరులో కొండవీడు ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు గజ్జలకొండ దాటిన తర్వాత హరిబాబు భోజనం పూర్తి చేసి, వాష్‌బేసిన్ వద్ద చేతులు కడిగి, కొద్దిసేపు బోగీ తలుపు దగ్గర నిల్చున్నారు. అదే సమయంలో రైలు ఒక్కసారిగా కుదిపేయగా, హరిబాబు అదుపుతప్పి కింద పడిపోయారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గమనించిన ఇతర ప్రయాణికులు వెంటనే ఆయన స్నేహితులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రైలు సుమారు 1.5 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయింది. వారు చైన్ లాగడంతో రైలు ఆగింది. సమాచారం అందుకున్న లోకో పైలట్లు, గుంటూరు రైల్వే అధికారుల అనుమతితో రైలును వెనక్కు నడిపించారు. తర్వాత హరిబాబును పట్టాల పక్కన గుర్తించి బోగీలోకి ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ నుండే 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే మృతిచెందడంతో విషాదం నెలకొంది.






















