MLA Maddali Giridhar: "క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు నన్నూ సంప్రదించారు, కావాలంటే కాల్ డేటా చూడండి"
MLA Maddali Giridhar:ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలంటూ టీడీపీ నేతలు తనను సంప్రదించారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Maddali Giridhar: ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ నుంచి తనకు రూ.10 కోట్ల ఆఫర్ వచ్చిందని నిన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక ఆరోపించారు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అలాంటి కామెంట్స్ చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. క్రాస్ ఓటింగ్ చేయాలంటూ టీడీపీ నేతలు తనను సంప్రదించారని టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తెలిపారు.
వారంపాటు టీడీపీ నేతల నుండి ఫోన్ కాల్స్
ఎమ్మెల్సీ ఎన్నికలకు వారం ముందు నుండి తనను టీడీపీ నేతలు సంప్రదిస్తూ వచ్చారని, స్వయంగా కూడా కలిశారని మద్దాలి గిరిధర్ తెలిపారు. స్వయంగా టీడీపీ పార్టీ పెద్దలు తనకు ఫోన్ చేశారని.. వాళ్లతో, వీళ్లతో మాట్లాడిస్తామని చెప్పారని వెల్లడించారు. తనకు ఎవరెవరి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయో తన కాల్ డేటా చూసుకోమని అన్నారు. తనకు ఫోన్ వచ్చిన నంబర్ ను కూడా ఓ పేపర్ పై రాసి మీరే తీసుకోమని మీడియాను మద్దాలి గిరిధర్ కోరారు. ఆ ఫోన్ నంబర్ ఎవరిదో చూస్తే మీకే అర్థం అవుతోందని తెలిపారు.
డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాను
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు తనను సంప్రదించినా, ఆఫర్లు ఇచ్చినా తాను మాత్రం టీడీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. పచ్చ పార్టీని వీడి మూడు సంవత్సరాలు మూడు నెలలు అయిందంటూ చెప్పుకొచ్చారు. డబ్బులకు అమ్ముడు పోయే నీచమైన రాజకీయాలు తాను చేయలేదని, చేయబోనని మద్దాలి గిరిధర్ తెలిపారు. కనీసం పార్టీలో గౌరవం ఇవ్వకపోవడంతోనే తాను టీడీపీ పార్టీని వీడినట్లు మద్దాలి గిరిధర్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అన్నారు. సీఎం జగన్ పై ఉన్న అభిమానంతో తాము వైసీపీలో చేరామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తమపై నిందలు వేస్తున్నారని, అందుకే తాము స్పందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు గిరిధర్.
టీడీపీ పార్టీ పతనం అవ్వడానికి లోకేష్ కారణమని మద్దాలి గిరిధర్ విమర్శలు చేశారు. అవగాహన లేని లోకేష్ కోసం పార్టీని నాశనం చేశారని అన్నారు. జగన్ తమను సొంత కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటున్నారని తెలిపారు. నా వాళ్ళు మాత్రమే అనే నైజం టీడీపీ అధినేత చంద్రబాబుదని మద్దాలి విమర్శించారు. ప్రజా సమస్యలపై సరిగా వ్యవహరించడం లేదని కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని సీఎం జగన్ చెప్పారని, అలాంటి నిజాయితీ గల వ్యక్తి జగన్ అంటూ కొనియాడారు గిరిధర్. నిజాయితీగా ఉండే వ్యక్తి జగన్ అని నమ్మించి మోసం చేసే నైజం చంద్రబాబుదని విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిది ముక్కుసూటి వ్యక్తిత్వమని, ముందు ఒకమాట, వెనక ఒక మాట మాట్లాడే నైజం తనది కాదని చెప్పారు మద్దాలి. ఆమరావతి ఉద్యమం కోసం ఎమ్మెల్యే శ్రీదేవి పోరాడతానని అనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఎద్దేవా చేశారు. పూటకొక పార్టీ మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు.