గేటు కూడా పెట్టనివాళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారా: ధూళిపాళ్ల
సీఎం జగన్ అసమర్ధ పాలన వల్లే పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. పోలవరాన్ని పూర్తి చేయగలరా అని ప్రశ్నించారు.
జగన్ రెడ్డి అసమర్ధ పాలన, అసంబద్ద నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... గతంలో జగన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలే నేడు పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారాయన్నారు. ఏ పాలకులకైనా, ప్రభుత్వానికైనా రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమన్నారు. జగన్ రెడ్డి మాత్రం స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలను విస్మరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. పనులు త్వరితగతిన ముందుకు సాగేలా కృషి చేశారని గుర్తు చేశారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. 71శాతం పనులను పూర్తి చేశారని వెల్లడించారు. డయాఫ్రంవాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చారన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేశారని తెలిపారు. రూ.7వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్ట్ లో జగన్ రెడ్డి వైఫల్యాలు..
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్య ధోరణిని అవలంభించి పనులు నెమ్మదించేలా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. విధ్వేషం, విధ్వంసమే అజెండాగా ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఒక్క శాతం కూడ ముందుకు సాగని పరిస్ధితి ఏర్పడిందని ఆరోపించారు. నిర్మాణ సంస్ధని మార్చొద్దని పీపీఏ హెచ్చరించినా జగన్ రెడ్డి తన స్వార్థం కోసం, తన బంధువులకు కట్టబెట్టడం కోసం ఏజెన్సీని మార్చారన్నారు. దీని వల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని.. ఏజెన్సీని మార్చడం వలన 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు దాదాపు 14 నెలలు పనులు ఆగిపోయాయని తెలిపారు. పనులు నిలిపివేయడంతో పడిన వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్ధితి వచ్చిందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 23 మంది ఎంపీలని ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ స్వార్ధంగా తన కోసం, తన కుంటుంబం మీద ఉన్నకేసులు, తన నాయకులు చేసే తప్పులను సమర్ధించుకోవడానికి కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి పోలవరానికి సంబంధించిన నిధులు, అనుమతులు గురించి కేంద్రం మీద ఒత్తిడి తేలేదన్నారు. తన కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రానికి దాసోహం అవుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న మూడున్నరేళ్లలో రూ. 2వేల కోట్లను కూడా ప్రాజెక్ట్ కి వినియోగించలేదని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ..
ఏజెన్సీ పోలవరం ప్రాజెక్టు పనులని చేపడుతుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలంటే నిర్మాణ సంస్థని మార్చొద్దని పీపీఎ హెచ్చరించిందని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు పీపీఏ నియమించిన ఐఐటీ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ పనులు జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, నిర్ణయాలే కారణం అని తేల్చి చెప్పినట్లు వివరించారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న జగన్ రెడ్డి పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు మీద ఎన్నో అసత్య ఆరోపణలు చేశారన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయితే రాష్ట్రం ఎందుకు బాధ్యత వహిస్తుందని, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడారని స్పష్టం చేశారు. రివైజ్డ్ రిపోర్ట్ 54వేల కోట్ల రూపాయలకి ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విడేషన్, ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అంచనాలనను వేసి పోలవరం రివైజ్డ్ రిపోర్ట్ పంపిస్తే దోపిడి కోసమే ఆ రిపోర్ట్ అని ఆరోపించినట్లు గుర్తించారు.
పక్క రాష్ట్రాలు కూడా ప్రశ్నిస్తున్నాయి..
మునుపెన్నడూ ప్రశ్నించని పక్క రాష్ట్రాలు నేడు జగన్ రెడ్డి ప్రభుత్వ అలసత్వం, పోలవరం ప్రాజెక్ట్ పనులలో నిర్లక్ష్యం చేయడం మూలాన ప్రశ్నిస్తున్నాయన్నారు. న్యాయస్థానాలు వేలెత్తి చూపించే అవకాశం కల్పించింది జగన్ ప్రభుత్వమే అంటూ మండిపడ్డారు. మూడున్నరేళ్ళలో పోలవరం నిర్వాసితులకు జగన్ రెడ్డి చేసిందేమిటో చెప్పాలన్నారు. నిర్వాసిత ప్రాంతాలలో పాదయాత్ర చేసినప్పుడు తన తండ్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకున్న పొలాలకు అదనంగా 5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ హామీగానే మిగిలిపోయిందన్నారు. 10లక్షలపైనా ఆర్థిక సాయం పెంచి ఇస్తామని చెప్పి చేయలేకపోయారని పోలవరం భూ సేకరణలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వందల కోట్లు దోపిడి చేశారన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ.. సుప్రీం కోర్టులో కేంద్ర ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే నేడు మూడు రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం పెట్టమని కోరడం వివాదాస్పదం చేసే నిర్ణయం అన్నారు. జగన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల రాష్ట్రాలు అడ్డు పడుతున్నాయని ధూళిపాళ్ల ధ్వజమెత్తారు.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ప్రాజెజెక్టు పూర్తయ్యేది..
గతంలో అనిల్ కుమార్ యాదవ్ జల వనరులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2021 ఏప్రిల్, 2021 డిసెంబర్, 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పనులు పూర్తి అవుతాయని తేదీలు మార్చి చెప్పుకుంటూ వచ్చారని అన్నారు. ప్రస్తుత మంత్రిగా ఉన్న అంబటి రాబాంబు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేక పోతున్నారని... వైసీపీ మంత్రుల మాటలను గమనిస్తే వారికి పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత కాదు అనే విషయం స్పష్టమవుతుందని వివరించారు. కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్ దెబ్బ తినడానికి కారణం ప్రభుత్వమేనన్నారు. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్ పనులు పూర్తి అయి ఉండేవని పేర్కొన్నారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పాలనలో పాలకులు ప్రజల మంచి, చెడ్డలను చూసుకోవాలని.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని.. జగన్ రెడ్డి ప్రభుత్వం గురించి వస్తున్న ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల మీద అసహనాన్ని చూపెడుతున్నారని మండి పడ్డారు.
అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయి అక్కడ ప్రాంతాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. నష్టపోయిన రైతు తన కుమార్తెను తీసుకొని ముఖ్యమంత్రిని కలవాడానికి ఎంత ప్రయత్నించినా కలవలేకపోయారని తెలిపారు. పులిచింతల గేటు, గుండ్లకమ్మ ఏరు గేటు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా వృథాగా పోయిందని చెప్పారు. ప్రాజెక్టులకి ఒక గేటును కూడా పెట్టలేని మంత్రులు, ముఖ్యమంత్రి.. పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయగలరా అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు.