విచారణ అధికారుల యూ టర్న్- వైద్యపరీక్షల అనంతరం చంద్రబాబును మరోసారి సిట్ ఆఫీస్‌కు తరలింపు
శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సుదీర్ఘంగా చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు వేకువజాము మూడు గంటల సమయంలో వైద్య పరీక్షలు జరిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సిఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ సిట్ అధికారులు అనూహ్యంగా చంద్రబాబును మళ్లీ సిట్ కార్యాలయానికి తరలించారు.
శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సుదీర్ఘంగా చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు వేకువజాము మూడు గంటల సమయంలో వైద్య పరీక్షలు జరిపారు. సుమారు యాభై నిమిషాల పాటు వైద్యపరీక్షలు పూర్తి చేశారు. ప్రత్యేక గదిలో ఆయన వద్ద నుంచి శాంపిల్స్ సేకరించారు. గుండె, షుగర్, బీపీ ఇలా ప్రాథమిక పరీక్షలన్నింటినీ చేశారు.
అరెస్టు చేసిన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత నేరుగా జడ్జిముందుకో లేదా కోర్టులో తరలించడం సాధారణంగ జరిగే ప్రక్రియ. కానీ చంద్రబాబు విషయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రాత్రి వైద్య పరీక్షలు చేయించిన అధికారులు ఆయన్ని మరోసారి సిట్ కార్యాలయానికి తరలించారు.
చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తీసుకొస్తారని ఊహించిన ఫ్యామిలీ మెంబర్స్ నారా లోకేష్, భువనేశ్వరి, ఆయన తరఫు లాయర్లు అక్కడకు చేరుకున్నారు. టీడీపీ లీడర్లు కూడా కోర్టు ప్రాంగణంలో వెయిట్ చేస్తున్నారు. అయితే అధికారులు ఆయన్ని కోర్టుకు కాకుండా సిట్ కార్యాలయానికి తీసుకెళ్లడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తీరుపై కోర్టు వద్ద ఉన్న టీడీపీ లీడర్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.