CM Jagan on Ramya Case : రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు తీర్పు చరిత్రాత్మకం : సీఎం జగన్
CM Jagan on Ramya Case : గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో దోషికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇది చరిత్రాత్మక తీర్పు అని సీఎం జగన్ అన్నారు. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు.
CM Jagan on Ramya Case : గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరి శిక్ష విధించింది. ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. దిశ స్ఫూర్తితో రమ్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్ న్యాయవాదిని సీఎం అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటిచెప్పిందన్నారు. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని సీఎం వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తు జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట వేయాలన్నారు. దర్యాప్తులో, విచారణలో ఉన్న ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు.
విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022
మంత్రి రోజా స్పందన
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి, నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు రావడంపై రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. దిశ చట్టం స్ఫూర్తితో హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడ్ని పట్టుకుని, ఐదు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి దిశ పోలీసులతో విచారణ జరిపించి నిందితుడ్ని శిక్షపడేలా చేశారని రోజా అన్నారు. ఈ దిశ చట్టాన్ని అమలు చేస్తే నిందితులను 21 రోజుల్లోనే శిక్షించవచ్చన్నారు. నిందితులకు తప్పు చెయ్యాలంటే భయం ఉంటుందని, ఆడపిల్లలకు రక్షణ ఉంటుందన్నారు.
రమ్య కుటుంబానికి అండగా
"దిశ చట్టం అమలు చేయకపోయినా దిశ చట్టం స్ఫూర్తితో ఈ కేసు విచారణ చేపట్టారు. 9 నెలల్లోనే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేటట్లు చేశారు. ఆడపిల్లల మీద జరిగిన ఏ చిన్న విషయాన్ని అయినా టీడీపీ రాజకీయం చెయ్యాలని చూస్తుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో దిశ లాంటి చట్టాలు ఎందుకు చేయలేదు. గత ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయి. అయినా అప్పటి ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకురాలేదు. సీఎం జగన్ మాత్రం మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే దిశ చట్టం, యాప్ తీసుకొచ్చారు. టీడీపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. దిశ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది మహిళలను రక్షించారు. రమ్య ఘటన చాలా దురదృష్టకరం. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం చాలా వేగంగా స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించారు. ఈ కేసులో త్వరితగతిన తీర్పు వచ్చేలా చేసి సీఎం జగన్ రమ్య ఆత్మకు శాంతి కలిగేలా చేశారు." అని మంత్రి రోజా అన్నారు.
రికార్డు సమయంలో కేసు విచారణ
రమ్య కేసులో తీర్పుపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రమ్య కేసులో దోషికి ఉరిశిక్ష పడడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ ఘటనలో అదుపుచేసేందుకు సీఎం జగన్ దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. రమ్య కేసులో ప్రభుత్వం చాలా వేగంగా పనిచేసిందన్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేసి దోషికి శిక్ష పడేలా చేసిందన్నారు. 9 నెలల్లోనే శశికృష్ణకు శిక్షపడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.