CM Jagan Review :పట్టణాలు, నగరాల్లో మార్చి 31 నాటికి రోడ్లు బాగుచేయాలి- సీఎం జగన్
CM Jagan Review : రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తుండడంతో రహదారుల పరిస్థితులపై డ్రైవ్ చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మార్చి 31 నాటికి రోడ్లను బాగు చేయాలని సూచించారు.
CM Jagan Review : పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ అంశాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయని, పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. డ్రైవ్ చేపట్టి మార్చి 31వ తేదీ నాటికి రోడ్లను మళ్లీ బాగుచేయాలని ఆదేశాలు ఇచ్చారు. గార్బేజ్ స్టేషన్ల పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేకుండా నిర్వహణ ఉండాలన్నారు. ఇలాంటి చోట్ల నిర్వహణలో స్వచ్ఛ ప్రమాణాలు పాటిస్తున్నామనే దానిపై అవగాహన కల్పించాలన్నారు.
మున్సిపాలటీల్లో మౌలిక సదుపాయాలు
మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలపై నివేదికలు సమర్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో వేస్ట్ ప్రాసెసింగ్ అమలు తీరును అధికారులు పరిశీలించాలన్నారు. మున్సిపాలిటీ వారీగా చెత్త శుద్ధి సౌకర్యాలు, వసతులు, మురుగునీటి శుద్ధి అంశాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై నివేదికలు తయారు చేయాలన్నారు. కృష్ణా నది వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించిందని తెలిపారు. గోడకు ఒకవైపున మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైనింగ్ వాల్ బండ్‌పై చెట్లు, విద్యుత్ దీపాలు, ఏర్పాటుచేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం
ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందని సీఎం జగన్ తెలిపారు. ఈ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ నుంచి క్లాత్ వైపు వ్యాపారులను మళ్లించడానికి ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు సాయం అందించాలన్నారు. రుణాలు ఇప్పించి వారికి అండగా నిలవాలన్నారు. రుణాలను సకాలంలో కట్టేవారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ ఆరా తీశారు. జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీల నిర్మాణం పూర్తయ్యే కొద్దీ మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముందుకు సాగాలన్నారు. నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఏర్పాటు చేసి మురుగు నీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు తెలిపారు. అంబేడ్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక లేఅవుట్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.
Also Read : JC Prabhakar Reddy : ఈడీ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, మనిలాండరింగ్ ఆరోపణలపై విచారణ!
Also Read : Amalapuram BRS Banners : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, అమలాపురం ఎంపీ అభ్యర్థి ఆయనేనా?