(Source: ECI/ABP News/ABP Majha)
Amalapuram News : స్కూల్ పక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు, 40 మంది విద్యార్థులకు అస్వస్థత!
Amalapuram News : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ పక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలు తగలబెట్టడంతో పొగ వ్యాపించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Amalapuram News : అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంకలోని విజ్ డమ్ ప్రైవేటు పాఠశాలలో ఊపిరాడక 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల పక్కనే ప్లాస్టిక్ వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో వచ్చిన పొగతో విద్యార్థులు స్పృహ తప్పారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థులను బండారులంకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం ఆరోగ్యం మెరుగుపడిన 29 మందిని ఇంటికి పంపించారు. మరో 11 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం 108 వాహనాలలో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దట్టంగా వచ్చిన పొగ వల్ల ఊపిరాడకే అస్వస్థత కలిగిందని, వీరికి ప్రాణాపాయం లేదని పరిశీలన అనంతరం మరో రెండు గంటల్లో విద్యార్థులను డిచార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
కలెక్టర్ పరామర్శ
అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను దగ్ధం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసులను ఆదేశించారు.
టెక్కలిలో 13 మంది విద్యార్థులకు అస్వస్థత
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఫుడ్ పాయిజన్ అయి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టెక్కలి మండలం పోలవరం గ్రామంలోని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో సోమవారం ఉదయం టిఫెన్ తిన్న 13 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వసతి గృహ సంక్షేమాధికారి అప్పారావు విద్యార్థులకు ఏఎన్‌ఎంల సమక్షంలో విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను టెక్కలి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తలించారు.