Amaravati 700 Days : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులైంది. ఒక్క రాజధాని లేదా 3 రాజధానులు అనే అంశాన్ని పక్కన పెడితే ఈ రాజకీయంలో నట్టేట మునిగినవారు రైతులే. న్యాయం కోసం వారి పోరాటం సుదీర్ఘంగా సాగుతోంది.
అమరావతికి భూములిచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే అదృష్టవంతులని అప్పట్లో అనుకున్నారు. కానీ గత రెండేళ్ల నుంచి వాళ్ల కంటే దురదృష్టవంతులు ఎవరూ ఉండరని కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఓ ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన వారు..మరో ప్రభుత్వంలో వేదనకు గురవుతున్నారు. తప్పులు ప్రభుత్వాలు చేశాయి కానీ అసలు నష్టం మాత్రం ఈ రైతులకే. ఈ రైతులు రోడ్డున పడి 700 రోజులు అయింది. న్యాయం కోసం లాఠీదెబ్బలు తిన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ తమ ఆవేదనను రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నారు.
700 రోజుల కిందట 3 రాజధానుల నిర్ణయం!
ఖచ్చితంగా 700 రోజుల కిందట మూడు రాజధానులను పెట్టబోతున్నామని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. 2019 డిసెంబర్ 17న సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని అందుకే దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు పెడుతున్నామని ప్రకటించారు. కర్నూలును న్యాయ రాజధాని, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. అప్పుడే రైతుల గుండెల్లో రాయిపడింది. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల నేరుగా ప్రత్యక్షంగా నష్టపోయేది రాజధానికి భూములిచ్చిన వాళ్లే. పైసా పరిహారం తీసుకోకుండా అమరావతి అభివృద్ధి చెందితే దాంతో పాటు తామూ ఎదుగుతామని నమ్మి వారు భూములిచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే రెంటికి చెడ్డ రేవడిగా రైతుల పరిస్థితి అవుతుంది. అందుకే వారు రోడ్డెక్కారు.
ఏకగ్రీవంగా నిర్ణయించిన రాజధాని అమరావతి !
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. ఏ ప్రాంతంలోనూ వ్యతిరేకత రాలేదు. అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంద్ర నుంచి ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అందరూ నిర్ణయాన్ని స్వాగతించారు. చివరికి ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ .. అప్పట్లో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో సంపూర్ణమైన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన సూచనలకు తగ్గట్లుగానే భూములు, ఇతర సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆ తరవాత కూడా ఎక్కడా అమరావతికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. అమరావతితో ఎమోషనల్ టచ్ ఉండేలా ప్రతి ఒక్కరి రాజధా ని అని చెప్పేలా అప్పటి ప్రభుత్వం రూ. పది చొప్పు బ్రిక్స్‌ను విరాళంగా ఇవ్వాలని కూడా కోరింది. దానికి కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి స్పందన వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని అన్ని ప్రాంతాల్లో చెప్పారు. సీఎం జగన్ కూడా చంద్రబాబు అమరావతిని కట్టలేకపోయారని తాము వచ్చి కట్టి తీరుతామని ఎన్నికల ప్రచారసభల్లో ప్రకటించారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికీ సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి.
అన్నీ అమరిన రాజధాని అమరావతి !
అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన తర్వాత గత ప్రభుత్వానికి అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతులనుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలకుపైగానే పటటింది. వరద ముప్పు ఉందన్న అంచనాతో కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్ళాలని హరిత ట్రిబ్యూనల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాలు పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పధకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8నుండి 10 నెలలు కాలంలోనే చాలా భవనాలు 80నుండ 90 శాతం పూర్తయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం దగ్గర్నుంచి ఇప్పుడు అమరావతి పరిధిలోని ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. ప్రైవేటు వర్సిటీలు ...ప్రభుత్వ భవనాలు... పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉంటాయి. రెండేళ్ల నుంచి అక్కడి నుంచి నిక్షేపంలా పాలన సాగుతోంది. అన్ని వ్యవస్థలూ అమరావతి నుంచే పాలన సాగిస్తున్నాయి.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
రాజకీయ చదరంగంలో బాధితులుగా రైతులు !
రాజధాని కోసం పరిహారం తీసుకోకుండా భూములిచ్చారు. తమ భూముల్లో రాజధాని వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. భూములిచ్చినవారిలో దళితులు ఎక్కువ. 95 శాతం సన్న , చిన్నకారు రైతులే. జగన్ నిర్ణయం తమ జీవితాల్ని తలకిందులు చేసిందని వారు రోడ్డెక్కారు. అమరావతి ఉద్యమం అనేక ఎత్తు పల్లాలు, కష్టనష్టాలు, బాధలు, రైతుల ఆవేదనలతో ఐదు 7 వందల రోజులుగా సాగుతోంది. ప్రభుత్వం వ్యవహరిచిన తీరు, న్యాయస్థానాల నుంచి లభించిన ఊరటతో అమరావతి ఉద్యమం మైలురాయిని అందుకున్నారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించిన వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంచడానికి సిద్ధపడలేదు. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందా లేదా అన్న చర్చ పక్కన పెడితే ఇప్పుడు నష్టపోయే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ న్యాయం ఏకైక రాజధానిగా అమరావతి ఉంచడమే అని రైతులు అంటున్నారు.
Also Read : అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !
పాదయాత్రతో ప్రజల మద్దతు కూటగట్టుకునే ప్రయత్నం !
రాజధానిపై రాజకీయం కారణంగా భూములిచ్చిన వారు ఇప్పటి వరకూ ఒంటరైపోయారు. వారిపై రకరకాల నిందలేశారు. కులం, మతం, ప్రాంతం ఇలా అన్ని ముద్రేలేశారు. కానీ అక్కడ అన్ని వర్గాల వారూ రైతులు ఉన్నారు. ఇప్పుడు వారు తమ పాదయాత్ర ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి అక్కడ సానుకూలంగా ఉంది. అమరావతి వ్యవహారంలో రైతులకు ఈశ మాత్రం కూడా సంబంధం లేదు. తప్పులేమీ చేసినా ప్రభుత్వాలవే. కానీ రైతులు మాత్రం కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని మనం పురాణాల్లోనే చదువుకున్నాం..!
Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నో పర్మిషన్.. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న డీజీపీ !