Paddy Issue: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆపే కుట్ర- కేంద్రంపై మంత్రి గంగుల సంచలన ఆరోపణలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై దుమారం ఇంకా చల్లారలేదు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి అదే స్థాయిలో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిది రాష్ట్ర ప్రభుత్వం.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తప్పని చెబుతూ శ్వేత పత్రం విడుదల చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి పండకపోవడం, ధాన్యం పండించే రాష్ట్రాలైన తెలంగాణ, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ అధికారంలో లేకపోవడంతోనే సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారాయన.
కనీసం బ్యాగ్ అయినా ఇచ్చారా?
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించకున్నా రాష్ట్రం తరఫున నిధులు వెచ్చించి రైతులు ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు గంగుల కమలాకర్. ఇలాంటి టైంలో అత్యంత అవసరమైన గన్నీ బ్యాగులను కూడా ఇవ్వని కేంద్రం సమస్యలు సృష్టిస్తోందన్నారు. అలా కేంద్రం బ్యాగ్స్ ఇవ్వకున్నా రైస్ మిల్లర్ల వద్ద, సప్లయర్స్ నుంచి సేకరించి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి. ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరుపుతున్నామని అన్నారు. కేంద్రం మాత్రం దీనికి పూర్తి విరుద్దంగా రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
వెరిఫికేషన్‌తో భయోత్పాతం
యాసంగిలో రా రైస్ రాదని తెలిసినా అదే ఇవ్వాలని మంకుపట్టు పట్టడం, నేడు కొనుగోళ్లు ఊపందుకునే దశలో దాన్ని అడ్డుకునే విదంగా ఎఫ్.సి.ఐ అధికారులను ఉసిగొల్పి రైస్ మిల్లులపై వెరిఫికేషన్ పేరుతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు గంగుల. తెలంగాణ రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కేంద్రానికి హితవు పలికారు. దీనిపై తెలంగాణ ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి రైతుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలుపై శ్వేతపత్రం
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం వరకూ జరిపిన కోనుగోళ్ల వివరాలు, గన్నీబ్యాగుల నిల్వ వివరాలు వెల్లడించారు.
4,21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కొనుగోళ్ల మొదలు పెట్టిన రోజే బహిరంగంగా ఎన్ని గన్నీ బ్యాగులున్నాయన్నామో చెప్పామన్న మంత్రి గంగుల నేడు కేంద్రం నుంచి ఒక్క బ్యాగు రాకున్నా రూ. 7కోట్ల 77 లక్షలను రికార్డు స్థాయిలో సేకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 4,21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55553 మంది నుంచి సేకరించామన్నారు. ఈ ధాన్యం విలువ రూ. 821 కోట్లని తెలిపారు.
ధాన్యం డబ్బులు రైతులకు చేరకుండా కుట్ర
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలంటే మిల్లర్లు గుర్తించాల్సి ఉంటుందని ఈ ప్రక్రియకు కేంద్రం అడ్డుపడుతుందన్నారు గంగుల కమలాకర్. ఎఫ్.సి.ఐ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో మిల్లర్లు ధాన్యం దించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా రైతులకు సకాలంలో ధాన్యం సేకరణ, డబ్బుల విడుదల చేయకుండా కుట్ర పన్నారన్నారు.
ఒకరిద్దరు చేసిన అక్రమాలకు..
2019లో కేంద్రంతో ఎప్.సి.ఐతో ఎంఓయూ చేసినప్పుడు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎలా సేకరిస్తుందో అలా సహకరిస్తామని చెప్పామని, కానీ ఇష్టానుసారం రైతులకు ఇబ్బందులు సృష్టించేలా పీవీ నిర్వహించడం సరికాదన్నారు గంగుల. వడ్లు సేకరించేందుకు రూపాయి కూడా ఇవ్వని కేంద్రం.. ఆ వడ్లు తమవేనంటూ ఎలా అనగలదని ప్రశ్నించారు. 2900 మిల్లర్లలో ఒకరిద్దరు మిల్లర్లు అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలతో రైతులను ఇబ్బందులు పెట్టడం సమంజసమా అని నిలదీశారు. దాడి చేయాల్సిన అవసరం ఏంటన్నారు.
అక్రమాలపై ఉక్కుపాదం
రైతులకు చెల్లించే డబ్బు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివని... అందులో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించబోమన్నారు గంగుల. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దన్న కేసీఆర్ ఆదేశాలతో అక్రమార్కులపై అక్రమాలు చేసిన ఒకరిద్దరిపై కేసులతో పాటు పూర్తి సొమ్ము రికవరీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇలాంటి టైంలో పూర్తిగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను నిలిపేసి తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలో భాగమే ఈ పిజికల్ వెరిఫికేషన్ చర్యలని అన్నారు మంత్రి గంగుల.
రైతులకు ఏం సమధానం చెబుతారు?
వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు రైస్ మిల్లులో ఉండే హమాలీ మొదలు గుమాస్తా, అకౌంటెంట్ వరకూ అక్కడే ఉంటారని ఇది జరిగే వరకూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు రైస్ మిల్లును మూసేస్తారని తెలిపారు. అప్పుడు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దించుకోకపోతే రైతులకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కొనుగోళ్లు ఊపందుకున్నప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని ఎప్.సి.ఐకు చెప్పామన్నారు. కొనుగోళ్లు ఇప్పుడే మొదలైతే ధాన్యం ఉందో లేదో ఇప్పుడే ఎలా చూస్తారని, మొత్తం కొనుగోల్ల ప్రక్రియ ముగిశాక పీవీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఇందుకోసం జూలై మాసంలో పీవీ చేద్దామని లెటర్లు రాసినా పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు.
అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో రైతుల ధాన్యం కొనకపోవడం వల్ల తడిస్తే బాధ్యత తీసుకుంటారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు గంగుల. రైతులకు త్వరగా ప్రక్రియ ముగిసేవిదంగా యుద్ద ప్రతిపాధికన కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ధాన్యాన్ని కొని మిల్లులకు పంపి కిలో తరుగు లేకుండా చూసుకుంటున్నామన్నారు. కానీ కేంద్రం చేపట్టే ఇబ్బందుల్ని ఆపాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్.