Crop Loans: తెలంగాణలో రైతులకు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు మొండిచేయి!
2023-24 వార్షిక రుణ ప్రణాళిక కింద ఈ వర్షాకాలం సీజన్లో 83,391 కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులకు దిశా నిర్దేశం చేసింది. కానీ అందులో కేవలం 35శాతం మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.
Crop Loans To Farmers:
తెలంగాణ రైతాంగానికి అప్పు పుట్టడంలేదు, బ్యాంకులు కూడా రైతులకు అప్పులిచ్చేందుకు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఓవైపు ప్రభుత్వం టార్గెట్ లు పెడుతున్నా, మరోవైపు బ్యాంకులు మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ సీజన్ లో టార్గెట్ ని 35 శాతం కూడా రీచ్ కాకపోవడం విశేషం.
సహజంగా అప్పివ్వడం ఇష్టంలేని షాపుల ముందు అప్పురేపు అనే బోర్డ్ రాసి ఉంటుంది. అంటే రేపు వచ్చి చదువుకున్నా కూడా అప్పు రేపు అనే ఉంటుంది. దీంతో అప్పు ఎవ్వరూ అడగరు అనేది షాపు యజమాని ఆలోచన. సరిగ్గా తెలంగాణ రైతాంగం విషయంలో బ్యాంకులు కూడా ఇలాగే ఇబ్బంది పెడుతున్నట్టు ఆరోపిస్తున్నారు అన్నదాతలు. ఇటీవలే ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఆ నిధులు కూడా కొంతమంది బ్యాంకు అకౌంట్లలో జమ కాలేదు. రుణమాఫీ పొందిన రైతులందరికీ తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కానీ అది సాధ్యం కావడంలేదు. పదే పదే సమీక్షలు పెట్టి బ్యాంకర్లకు చురుకుపుట్టించినా టార్గెట్ మాత్రం రీచ్ కావడంలేదు.
వర్షాకాలం సీజన్లో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ దశలో కనీసం పెట్టుబడి సాయమైనా బ్యాంకులనుంచి ఆశిస్తారు రైతులు. వ్యవసాయానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు అందించాల్సిన బ్యాంకులు, భిన్నంగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. వర్షాకాలంలో ఇప్పటికే 3 నెలలు గడిచినా కేవలం 35 శాతం మాత్రమే రుణాలు రైతులకు లభించాయి.
2023-24 వార్షిక రుణ ప్రణాళిక కింద ఈ వర్షాకాలం సీజన్లో 83,391 కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులకు దిశా నిర్దేశం చేసింది. కానీ అందులో కేవలం 35శాతం మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. మిగతావి లెక్కలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఏప్రిల్ నుంచి రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభించాలని సూచించినా, ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులు రైతులకు రుణాలివ్వడంలో తాత్సారం చేస్తున్నాయి.
సాగు పెట్టుబడుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరాకి రూ.5 వేలు సాయం చేస్తోంది. అయితే ఈ సీజన్లో వర్షాలు అనుకున్న సమయానికి రాకపోవడంతో విత్తనాల నష్టం ఎక్కువైంది. మూడుసార్లు రైతులు విత్తనాలు వేశారు. మరికొన్ని చోట్ల అతివృష్టి వల్ల నష్టం జరిగింది. దీంతో రైతులకు మళ్లీ పెట్టుబడులు అవసరం అయ్యాయి. బ్యాంకులు ఆదరించకపోవడంతో, రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంటకు పెట్టుబడులకోసమే కాదు, యంత్ర సామగ్రి, పాడి పశువులు, ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి కూడా రుణాలను బ్యాంకులు సరిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఓవైపు ప్రభుత్వం మాత్రం పంటల సాగు ప్రతి ఏడాదీ పెరుగుతున్నట్టుగా చెబుతోంది. అందులో ప్రభుత్వం గొప్ప ఉందా లేదా, ప్రాజెక్ట్ లతో ఎంత ప్రయోజనం ఉంది అనే విషయం పక్కనపెడితే, సాగుతో రైతు ఎంత సంతోషంగా ఉన్నారనేదే ముఖ్యం. సాగుకి పెట్టుబడి లేకుండా రైతు సంతోషంగా ఉండలేడు. ఆ భరోసా బ్యాంకులు ఇస్తేనే రైతన్న మొహంలో ఆనందం కనపడుతుంది. ఎన్నికల వేళ, రైతులు ఆనందంగా ఉంటేనే బీఆర్ఎస్ కి ఓట్ల రూపంలో అది కలిసొస్తుంది.