Uttam Kumar Reddy All Party meet on Banakcherla | బనకచర్లపై వేగంగా పావులు కదుపుతున్న తెలంగాణ | ABP Desam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ వేగంగా కదులుతోంది. ఆంధ్ర ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయంటున్న తెలంగాణ బుధవారం అఖిలపక్షాన్ని పిలుస్తోంది. ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రపోజ్ చేసిన అతిపెద్ద ప్రాజెక్టు బనకచర్ల. గోదావరి నీటిని సీమకు తరిలించే ఈ ప్రాజెక్టుపై ఏపీ చాలా శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికే దాని కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఫండింగ్ ఎలా రాబట్టాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఓ వైపు ఏపీ ఈ ప్రాజెక్టుపై చకాచకా పనులు చేస్తుంటే.. ఇంకోవైపు తెలంగాణ కూడా చాలా వేగంగా మూవ్ అవుతోంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. రేపే అన్ని పక్షాల సమావేశం జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ఆహ్వానిస్తూ అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు పంపారు. బనకచర్ల ప్రతిపాదనకు తమ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని.. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు చెప్పామని ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు.





















