Telangana High court on Hydra | తెలంగాణలో హాట్ టాపిక్ 'హైడ్రా' పై హైకోర్టు దృష్టి | ABP Desam
హైడ్రా..హైడ్రా..హైడ్రా.... హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్ గా మారిన అంశం. ప్రభుత్వ భూములు,చెరువులు, సరస్సులు, కుంటలు, నాళాల ఆక్రమణలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం పని చేసేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్ మానిటరింగ్ ప్రోటెక్షన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో 2000 చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రా పని చేయనుంది. జులై 19వ తేదీన ప్రభుత్వం హైడ్రాను జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పాటు చేసింది. హైడ్రాకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించింది. హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన సారధ్యంలోఈ హైడ్రా చెరువు ఆక్రమణల దారులపై కొరడా ఝుళిపించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సహా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎం.ఐఎం నేతలు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేసి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 117.2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.