NTR: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటిని వెంటనే సస్పెండ్ చేయాలి - ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్
NTR Fans: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.

NTR Fans Demanded TDP MLA Apology: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దుర్భాషలాడినట్లుగా ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తనపై కుట్రలు చేస్తున్నారని... ఆ ఆడియో కాల్ తనది కాదంటూ ఇప్పటికే ఎమ్మెల్యే వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరితో పాటు ఇతర సభ్యులు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ గురించి ఎమ్మెల్యే చాలా అసభ్యంగా మాట్లాడారని... ఆయన బహిరంగంగా సారీ చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 'టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్య సమాజం తలదించుకునేలా కామెంట్స్ చేశారు. మా ఎన్టీఆర్ తల్లి గురించి దారుణంగా మాట్లాడారు.
ఎన్టీఆర్ గురించే కాదు. ఏ స్త్రీ మూర్తి, తల్లి గురించి అలా మాట్లాడినా తప్పే. అలా ఎవరూ మాట్లాడకూడదు. ఇది సమాజానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే అనంతపురం నడిబొడ్డున బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలా కాకుండా ఆయన ఇంటిని ముట్టడించి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం కలిసి ఛలో అనంతపురం ర్యాలీకి పిలుపునిస్తాం.' అంటూ హెచ్చరించారు.
Also Read: 46 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో? - సిల్వర్ స్క్రీన్‌పై కమల్, రజినీ... డైరెక్టర్ ఎవరో తెలుసా?
అసలేం జరిగిందంటే?
ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'వార్ 2' రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించగా... ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ను దుర్భాషలాడారంటూ ఓ ఆడియో కాల్ వైరల్ అయ్యింది. ఎన్టీఆర్‌ను నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలాడడం ఆ కాల్‌లో ఉంది. 'మంత్రి లోకేశ్ గురించి తప్పుగా మాట్లాడతాడా? వార్ 2 ఎలా ఆడుతుందో చూస్తా. అనంతపురంలో సినిమా ప్రదర్శన నిలిపేయాలి.' అంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్లుగా అందులో ఉంది. ఇది నిమిషాల్లోనే వైరల్ కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.
అయితే, దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ కాల్ ఓ ఫేక్ అని... అందులో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని... విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయన్నారు. 'నేను కూడా నందమూరి కుటుంబానికి బిగ్ ఫ్యాన్. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించినట్లుగా ఓ కాల్ సృష్టించారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆ ఆడియో కాల్ వల్ల ఫ్యాన్స్ మనసు నొచ్చుకుని ఉంటే నా వైపు నుంచి సారీ చెబుతున్నా. నా ప్రమేయం లేకున్నా నా పేరు ప్రస్తావించారు కాబట్టి సారీ చెబుతున్నా.' అంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే, ఎమ్మెల్యే బహిరంగంగా సారీ చెప్పాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.





















