Sensational Bill before Parliament | ఐదేళ్ల శిక్ష పడే నేరం చేసి నెల రోజులు జైలులో ఉంటే పదవి పోయినట్లే | ABP Desam
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. కొన్ని సంచలన బిల్లులతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల భరతం పట్టేలా సంచలన బిల్లును ఈరోజు పార్లమెంటులో ఎన్డీయే సర్కార్ ప్రవేశపెడుతోంది. కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే నేరం చేసి..నెలరోజులు జైలులో కనుక ఉంటే 31వ రోజున పదవి ఊడిపోయేలా సరికొత్త బిల్లును తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. పైగా దీనికి మినహాయింపులు లేవు. దేశ ప్రధాని అయినా సరే 31వ రోజు పదవిని కోల్పోవాల్సిందే. కనీసం ఆయన రాజీనామాతో కూడా సంబంధం లేదు. నిబంధనల ప్రకారం పదవిని కోల్పోతారు అంతే. పీఎం, సీఎంలు, మంత్రులు ఎవ్వరికీ ఈ బిల్లు నుంచి మినహాయింపు లేకుండా కఠిన నిబంధనలతో ఈరోజు పార్లమెంటు ఎదుట బిల్లు రాబోతోంది. ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడులో ఓ మంత్రి జైలుకు వెళ్లినప్పుడు కనీసం రాజీనామా చేయకపోవటం జైలు నుంచే పాలన సాగించటం పై ప్రజాస్వామ్య వాదులు మండిపడగా..ఇకపై అలాంటి ఆటలకు చెక్ చెప్పేలా కొత్త బిల్లు నిబంధనలను కఠినతరం చేయనుంది. రెండోది జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా. సుదీర్ఘ కాలంగా డిమాండ్ వినిపిస్తున్న కశ్మీరీ ప్రజల కోరికను తీర్చేలా జమ్ము కశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. మూడోది ఆన్ లైన్ గేమింగ్ పైనా కొరడా ఝళిపించనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ గేమ్స్ అందిస్తున్న వారిపై మూడేళ్ల జైలు, కోటి రూపాయలు జరిమానా విధించేలా గేమింగ్ చట్టంలో మార్పులు చేసి బిల్లు ప్రవేశపెడుతోంది కేంద్రం.




















