Revanth Vs KTR: హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ పలుకుబడి - తేలిపోయిన కేటీఆర్ ప్రచారం - సుదర్శన్ రెడ్డికి మద్దతు లేనట్లే ?
KTR: కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని కేటీఆర్ చేస్తున్నప్రచారం తేలిపోయింది. రేవంత్ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చేది లేదని కేటీఆర్ అంటున్నారు.

Revanth influence in Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసం కోల్పోయిందని కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సార్లు ప్రకటించారు. రేవంత్ ను సీఎం పదవి నుంచి రేపోమాపో మార్చేస్తారని కూడా చెబుతూ వస్తున్నారు. రేవంత్ .. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాహుల్ సమయం ఇవ్వరని.. ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నా ఒక్క ఫోటో కూడా బయటకు ఎందుకు రాదని కేటీఆర్ ప్రశ్నించేవారు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు రాహుల్ గాంధీ డుమ్మా కొట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లోనూ రేవంత్ పై.. హైకమాండ్ లో అసంతృప్తి నిజంగానే ఉందా అన్న ప్రచారం ఊపందుకుంది.
రేవంత్ ను కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ ప్రచారం
అయితే ఇలాంటి ప్రచారాలకు రేవంత్ రెడ్డి చేతలతోనే చెక్ పెట్టేశారు. ఇండీ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని తానే ప్రతిపాదించారు. గెలుపు అవకాశాల్లేని ఎన్నిక కావడంతో.. ఓ తటస్థ, రాజ్యాంగ నిపుణుల్ని ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంది. దాని కోసం చాలా పేర్లు పరిశీలించినా వర్కవుట్ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి హైకమాండ్ సమస్యను చాలా సులువుగా పరిష్కరించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మాట్లాడి ఆయనను పోటీకి ఒప్పించి.. వెంటనే హైకమాండ్ వద్ద గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. దాంతో ఇండీ కూటమికి అభ్యర్థి సమస్య తీరిపోయింది.
ఏకంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థినే ఖరారు చేయించిన రేవంత్
సాధారణంగా రేవంత్ పై ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఇచ్చేది కాదు. అసలు రేవంత్ ప్రతిపాదించే పేరును పరిగణనలోకి తీసుకునేది కాదు. కానీ రేవంత్ పై నమ్మకం ఉండబట్టే వెంటనే ఆమోదం తెలిపింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి..హైకమాండ్ వద్ద ఏ మాత్రం పలుకుబడి తగ్గలేదని.. ఆయనను జాతీయ స్థాయి నాయకుడిగా హైకమాండ్ పరిగణిస్తోందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిని సీఎం పోస్టు నుంచి తప్పించి వచ్చే డిసెంబర్లో వేరే సీఎంను నియమిస్తారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్న దానికి భిన్నంగా ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ లో రేవంత్ స్థానం మరింత బలోపేతం
కాంగ్రెస్ పార్టీ బలం పూర్తిగా రేవంత్ రెడ్డేనని ఆయనపై హైకమండ్ లో విశ్వాసం తగ్గిపోయి పక్కన పెడితే బీఆర్ఎస్ కు ఆ నిర్ణయం మేలు జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే తెలంగాణలో జరిగే ప్రతి విషయాన్ని కేటీఆర్ తరచూ రాహుల్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తూంటారు. కాంగ్రెస్ పేరును రేవంత్ చెడగొడుతున్నారన్న అర్థం అందులో ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ట్వీట్లకు హైకమాండ్ ఏ మాత్రం ప్రభావితం కావడం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతిచ్చేది లేదన్న కేటీఆర్
కేటీఆర్‌కు కూడా ఈ అంశంపై స్పష్టత ఉంది. అందుకే.. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చేది లేదని ఆయన అంటున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నత పదవికి పోటీ పడుతున్న సమయంలో మద్దతివ్వాలని రేవంత్ చేసిన విజ్ఞప్తిని తోసి పుచ్చారు. అయితే మద్దతివ్వకపోతే.. తెలంగాణ పార్టీ.. తెలంగాణ వ్యక్తికి ఢిల్లీ స్థాయిలో సపోర్టు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది.





















