Mumbai Rains Heavy Rainfall | ఆరుగంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం..మునిగిన ముంబై | ABP Desam
మహారాష్ట్ర రాజధాని ముంబై మునిగింది. మాములుగా కాదు ఆరుగంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే జనజీవనం స్తంభించిపోయింది. వేర్వేరు ప్రాంతాల్లో 10మంది ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. నడుం లోతు నీళ్లలో ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాలలు, కాలేజ్ లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. రోడ్లపై వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవటంతో రైళ్లలో విపరీతంగా రద్దీ పెరిగింది. గరిష్ఠ స్థాయి బరువు దాటిపోవటంతో ముంబై మోనో రైలు గాల్లోనే నిలిచిపోయి అందరినీ కంగారు పెట్టింది. రోడ్లపై కార్లు నీళ్లలో తేలుతూ కనిపిస్తున్నాయి. చిన్నారులు రోడ్లపై ఈత కొడుతూ దర్శనమిస్తున్నారు. ఇంతటి మహానగరం నీట మునిగిపోతుంటే కొంత మంది మందుబాబులు చక్కగా స్విమ్మింగ్ పూల్ లో కూర్చున్నట్లు కూర్చుని ఇలా సిట్టింగ్ వేస్తూ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలంతా మరో 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.





















