Sigachi Chemical Explosion | మా అన్న శరీరమైనా ఇవ్వండి.. ఆసుపత్రి వద్ద తమ్ముడి ఆవేదన | ABP Desam
పాశమైలారం మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా 12 మంది చనిపోయారంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించిన తరువాత, మరో ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యుల ఆచూకి తెలియక అనేకమంది ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పటాన్‌చెరులోని పాశమైలారం ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక అల్లాడిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది వచ్చి పరిశ్రమలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాసరి రామాంజనేయులు అనే కార్మికుడు ఉదయం సిఫ్ట్ లో ఉండగానే రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది.రామాంజనేయులు ఆచూకీ కోసం తమ్ముడు ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేదు. గాయపడ్డవారి లిస్ట్ లో మీ అన్న పేరులేదని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. మా అన్న ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్ .. అంటూ రామాంజనేయులు సోదరుడు ఆసుపత్రి ముందు బోరున విలపిస్తున్న దృశ్యం చూపరులను కలచివేస్తోంది. పాశమైలారం మిగిల్చిన విషాద గాథపై ABP Desam ప్రత్యేక కథనం..





















