Sarpanch Unanimous Election | సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థులు | ABP Desam
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానేలేదు. అప్పుడే గ్రామాల్లో, తండాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాలాజీ నాయక్ అనే తండావాసిని ఏకగ్రీవం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే...సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాలాజీ నాయక్‌నే ఎన్నుకుంటామని తీర్మానించారు. మరి ఇలా యునానిమస్‌గా ఎన్నుకోవడానికి కారణమేంటని అడిగితే తండావాసులు ఆసక్తికర సమాధానం చెప్పారు. బాలాజీ నాయక్..తండాలో హనుమాన్ ఆలయంతో పాటు పోచమ్మ గుడి కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అంతే కాదు. బొడ్రాయి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అందుకే..వెంటనే ఏకగ్రీవం చేసేశారు. ఎన్నికల సమయంలో ఎవరైనా నామినేషన్ వేస్తే 50 లక్షలు జరిమానా వేసేవిధంగా పెద్ద మనుషులు, తండా వాసుల సమక్షంలో తీర్మానం చేశారు. చెరువుకొమ్ము తండాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బొడ్రాయి ఏర్పాటు చేస్తే ఈ దోషం పోతుందని స్థానికుల విశ్వాసం. అందుకే..బొడ్రాయి పెడతానని హామీ ఇచ్చాడు బాలాజీ నాయక్. ఆయనతో పాటు మరో ఇద్దరూ ముందుకొచ్చి బొడ్రాయి ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు.