Padi Kaushik Reddy Arrest | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ | ABP Desam
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని అక్రమ మైనింగ్ పై ప్రశ్నించినందుకే అరెస్ట్ చేయించారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న అభియోగాలపై నమోదైన కేసులో, ఆయనను పోలీసులు హైదరాబాద్‌లో అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను హనుమకొండ సుబేదారీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ సమయంలో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంటే, ప్రజా ప్రతినిధిగా నేను ప్రశ్నించాను. దానికే నన్ను అరెస్ట్ చేయడం ఒక రాజకీయ కక్ష తీర్చుకునే చర్య," అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
పోలీసులు విచారణ అనంతరం కౌశిక్ రెడ్డిని వరంగల్ మున్సిఫ్ కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను రేకెత్తించింది. ప్రభుత్వం ప్రవర్తనపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పెద్ద ఎత్తున జనాలు సంఘీభావం తెలుపుతున్నారు.





















