MLC Kavitha Political Journey explained | లిక్కర్ స్కామ్ టూ పార్టీ సస్పెన్షన్ | ABP Desam
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. కవిత పొలిటికల్ జర్నీ ఒకసారి చూస్తే ముందుగా ఆమె పాలిటిక్స్ పై అసలు ఇంట్రెస్ట్ తో లేరు. హైదరాబాద్ లో వీఎన్నాఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ లో బీటెక్ చదివిన కవిత..ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ సదరన్ మిసిసిపి యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. తన అన్న కేటీఆర్ తరహాలోనే సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ గా అమెరికాలో కవిత ప్రయాణం మొదలైంది. అయితే 2006 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చటంతో కవిత తిరిగి ఇండియాకు వచ్చేశారు. తన తండ్రి కేసీఆర్ సాగిస్తున్న తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 2006-2007 ప్రాంతంలో తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేశారు. 2009లో తెలంగాణ ప్రకటన, 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కవిత తనకు ఇష్టం లేకున్నా నిజామాబాద్ ఎంపీగా పోటీకి దిగారు. మంచి మెజార్టీతో గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. తర్వాత అప్పటి టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు రెండోసారి కవిత ఎంపీ గా పోటీ చేయాలని ఆదేశాలు అందాయి. ఇది కవితకు ఇష్టం లేదని ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారని కానీ పార్టీలోనే అందుకు కొంతమంది ఆమెకు అడ్డం పడ్డారని చెబుతారు. రెండోసారి ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు కవిత. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ బైపోల్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచి మండలికి వెళ్లారు కవిత. మండలి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతైనా మంత్రివర్గంలో స్థానం ఆశించిన అదీ దక్కకపోవటంతో మనస్తాపానికి లోనయ్యారు. ఈలోగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వినిపించటం తదనంతరం జరిగిన పరిణామాలు కవిత ప్రతిష్ఠను మసకబార్చాయి. తిహార్ జైలులో ఆరు నెలల పాటు ఉన్న కవిత..తిరిగి వచ్చిన తర్వాత సొంత పార్టీ పైనే విమర్శలు మొదలుపెట్టారు. తన ఓటమికి బీఆర్ఎస్సే కారణమని చెప్పిన కవిత..ఇటీవల చేసిన రెండు అమెరికా ప్రయాణాలతో పార్టీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నారు. మొదటిసారి కేసీఆర్ కు కవిత రాసిన లెటర్ లీక్ అవ్వటంతో...కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కామెంట్స్ చేసిన కవిత..రెండోసారి అమెరికా ప్రయాణ సమయంలో ఆమెకు ఉన్న ఏకైక సింగరేణి కార్మిక సంఘ అధ్యక్ష పదివిని కోల్పోయారు. కేవలం జాగృతి అధ్యక్షురాలిగానే కొంత కాలంగా గులాబీ కండువా పక్కన పెట్టేసి కనిపిస్తున్న కవిత..సోమవారం కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ ఉన్నారంటూ చేసిన సంచలన ఆరోపణలతో ఏకంగా సొంత తండ్రి పెట్టిన పార్టీ నుంచి సస్పెషన్ వేటుకు గురయ్యారు.





















