(Source: ECI/ABP News/ABP Majha)
Miyapur Land Kabza Issue | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన ప్రజలు | ABP Desam
హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీప్తిశ్రీనగర్ సర్వే నంబర్ 100,101 లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు వందలాదిగా గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు ఖాళీ చేయించేందుకు పోలీసులు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడిసెలను ఖాళీ చేసేందుకు అక్కడి ప్రజలు నిరాకరించారు. ఇక్కడి నుంచి వెళితే మాకు నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని వాపోయారు. కనీసం ఈ ప్రభుత్వమైనా స్పందించి తమకు అక్కడే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న గుడిసెలు తొలగించి.. ఖాళీ చేయించేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శేరి లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలో హెచ్ఎండీఏ భూమి ఉంది. ఇక్కడ ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారనే ప్రచారంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక్కడ దాదాపు రెండు వేల మంది వరకు గుడిసెలు వేసుకుని మూడు నాలుగు రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం హెచ్ఎం డీఏ అధికారులు మియాపూర్ పోలీసులతో కలిసి వారిని ఖాళీ చేయించేందుకని వెళ్లారు. ముందుగా అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించారు. ప్రభుత్వాలు ఇళ్లు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి, కానీ అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.