KKR vs SRH IPL 2024 Final Preview | చెపాక్ ఫైనల్ లో ప్రత్యర్థికి చెక్ పెట్టేది ఎవరు.? | ABP Desam
రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్న ఐపీఎల్ 2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ రోజు చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ముందు నుంచి నిలకడగా రాణిస్తూ వచ్చిన KKR జట్టు క్వాలిఫైయర్ 1 నెగ్గి ఫైనల్ కి చేరిపోతే...క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినా క్వాలిఫైయర్ 2లో ఎలిమినేటర్ విజేతను ఓడించి సన్ రైజర్స్ జట్టు ఫైనల్ బ్యాటిల్ కి వచ్చేసింది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలిచి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు రెండేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడాయి. 2012, 2014ల్లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంటే..తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న డెక్కన్ ఛార్జర్స్ 2009లో, సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాయి. 2009లో ఆడమ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్ గా డీసీని గెలిపిస్తే...2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా SRH కి కప్ అందించాడు. ఇప్పటికి KKR ఐపీఎల్ గెలిచి పదేళ్లు పూర్తైతే..సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదేళ్లుగా కప్ కోసం వెయిట్ చేస్తోంది.