Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desam
సినీ పరిశ్రమ వర్సెస్ ప్రభుత్వం గా కొద్ది రోజుగా సాగుతున్న సమస్యను చక్కదిద్దటానికి మెగాస్టారే బరిలోకి దిగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి వర్గంతో సినీ పరిశ్రమ భేటీకి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 10.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు హాజరవుతుండగా...ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో దిల్ రాజు ఇంకా పలువురు నిర్మాతలు సీఎం రేవంత్ తో భేటీ అవుతున్నారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, దామోదర రాజనర్సింహ ఉండనున్నానరని తెలుస్తోంది. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అని చెబుతున్నా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కేసు ఈ భేటీ లో ప్రధాన అంశంగా నిలవనుంది. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ మాట్లాడిన తీరు..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఇండస్ట్రీ టార్గెట్ గా చేస్తున్న కామెంట్స్ పై కచ్చితంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా, అల్లు అర్జున్ కు స్వయానా మావయ్యగా ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికే పనిలో చిరంజీవి సమావేశంలో లీడ్ తీసుకుంటారని తెలుస్తోంది. కోర్టులో కేసు నడుస్తుండగానే శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 చిత్రబృందం 2కోట్ల రూపాయల పరిహారం ప్రకటించటం ఇవ్వటం లాంటివన్నీ భేటీలో చర్చకు రానున్నాయి. టిక్కెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్స్ పైనా రేపటి సమావేశం తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండాలని సినీ ప్రముఖులు...సినీ ప్రముఖుల వృత్తికి, వ్యాపారానికి భరోసా కల్పించేలా ప్రభుత్వం ఓ శాంతిపూర్వక పరిష్కారమార్గానికి రావాలని ఇరువర్గాలు కోరుకుంటున్నాయి.