Rishabh Pant Century Somersault Celebrations | IPL 2025 లో సెంచరీ కొట్టి 27కోట్లకు న్యాయం చేసిన పంత్
ఈ ఐపీఎల్ సీజన్ ఆక్షన్ లో 27కోట్ల రూపాయల అత్యధిక ధర పలికి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషభ్ పంత్...నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎట్టకేలకు తన విలువకు తగిన ఆటను చూపించాడు. ముందు బ్యాటింగ్ చేసిన LSG కి వన్ డౌన్ లోనే బ్యాటింగ్ కు దిగిన తనదైన స్పైడీ స్టైల్ ఆటతీరుతో దుమ్ము రేపాడు. ఒంటి కాలిపై నిలబడి షాట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, పడుతూ లేస్తూ పొర్లుతూ దొర్లుతూ నానా బీభత్సం చేస్తూ మొత్తానికి సెంచరీ అయితే బాదేశాడు రిషభ్. మొత్తంగా 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్ గా నిలవటంతో పాటు ఆర్సీబీ 228 పరుగుల టార్గెట్ ఇవ్వటంతో పంత్ దే కీలకపాత్ర.
29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషభ్ పంత్ తర్వాత మరింత గేర్లు మార్చేసి మరో 25 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ పూర్తవగానే విష్ చేసేందుకు వస్తున్న పూరన్ ను ఆపి మరీ పిల్లి మొగ్గలు వేసి మరీ తన సంతోషాన్ని గ్రౌండ్ లో నిలబడి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు పంత్. మ్యాచ్ లో పంత్ అంత గొప్ప సెంచరీ బాదినా..228పరుగుల టార్గెట్ పెట్టినా ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ అద్భుతమైన పోరాటంతో బెంగుళూరు సంచలన విజయాన్ని సాధించింది. కీపర్ వర్సెస్ కీపర్, కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీ పంత్ ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ. అప్పుడెప్పుడో 2018 సీజన్‌లో తొలి సెంచరీ బాదిన రిషభ్ పంత్.. ఏడేళ్ల తర్వాత మరో శతకాన్ని అందుకున్నాడు. గత 13 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టి తన కెరీర్ లో చెత్త ఐపీఎల్ సీజన్ ను నమోదు చేసిన పంత్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చే తనెంత ప్రమాదకరమైన ఆటగాడినో నిరూపించటంతో పాటు కీలకమైన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కి ముందు ఫామ్ లోకి వచ్చి టీమిండియా ఫ్యాన్స్ కి సంతోషాన్ని మిగిల్చాడు పంత్.





















