PBKS vs MI Match Highlights IPL 2025 | ముంబైపై సెన్సేషనల్ విక్టరీ సాధించిన శ్రేయస్ సేన
టాప్ 2లో నిలవాలన్నా క్వాలిఫైయర్ 1 ఆడాలన్నా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కే షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. 18ఏళ్లుగా పోరాడుతున్న అందని కప్ కోసం జరుగుతున్న యుద్ధంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవం ఉన్న జట్టు ఎదురైనా అసలు ఏ మాత్రం తడబడలేదు శ్రేయస్ సేన. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంను హోం గ్రౌండ్ గా చేసుకుని ఆడిన డిసైడర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై 7వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్...ముంబై ని బ్యాటింగ్ కి ఆహ్వానించగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా చేసిన బౌలింగ్ తో ఛాంపియన్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు రికెల్టెన్ 27, రోహిత్ శర్మ 24పరుగులు చేసినా ముంబైకి ఊహించినంత స్ట్రాంగ్ ఓపెనింగ్ ని ఇవ్వలేకపోయారు. అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, మార్కో యాన్సన్ లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ తో టైట్ బౌలింగ్ చేస్తూ పరుగులు సీజ్ చేస్తూ ముంబైని ముప్పు తిప్పలు పెట్టారు. ఓ దశలో 13 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై స్కోరు 4వికెట్ల నష్టానికి 106పరుగులు. దూకుడు చూపించాల్సిన మ్యాచ్ లో ముంబై స్కోరు సాగిన విధానం ఇది. సూర్య కుమార్ యాదవ్ తనదైన స్టైల్ లో ఆడటంతో పాటు చివర్లో వేగంగా పరుగులు వచ్చేలా చేశాడు. 39 బాల్స్ లో ఆరు ఫోర్లు 2 సిక్సర్లతో 59పరుగులు చేసిన స్కై ముంబైని ఆదుకున్నాడు. చివర్లో పాండ్యా, నమన్ ధీర్ రెండేసి సిక్సులు కొట్టడంతో ముంబై 184 పరుగుల టార్గెట్ ను పెట్టగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. 185పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ ను ముందు నుంచి దూకుడును ప్రదర్శించింది. పిచ్చ ఫామ్ లో ఉన్న ప్రభ్ సిమ్రన్ సింగ్ త్వరగానే అవుటైపోయినా ఈ సీజన్ లో సెంచరీ వీరుడు ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ తో కలిసి తన దూకుడును చూపించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో పాటు స్కోరు బోర్డును లక్ష్యంగా దిశగా నడిపించాడు. ఆర్య 35 బాల్స్ లోనే 9ఫోర్లు 2 సిక్సర్లతో 62పరుగులు చేస్తే...ఇంగ్లిస్ 42 బాల్స్ లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 73పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ 26పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇవ్వటంతో పంజాబ్ కీలక మ్యాచ్ లో 7వికెట్ల తేడాతో విజయం సాధించటంతో పాటు `11ఏళ్ల తర్వాత క్వాలిఫైయర్ 1 ఆడేందుకు స్టేజ్ సిద్ధం చేసుకుంది.





















