Ramakant Achrekar Statue | ముంబై శివాజీపార్క్ లో రమాకాంత్ అచ్రేకర్ కు విగ్రహం | ABP Desam
క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ఆట నేర్పించి ఇంతటి వాడిని చేసిన గురువు రమాకాంత్ అచ్రేకర్ కు మహారాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ముంబైలోని ప్రఖ్యాత శివాజీపార్క్ లో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముంబై నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనతో పాటు ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను దేశానికి అందించిన తన గురువుకు సముచిత గౌరవం కల్పించటం ఎంతో సంతోషంగా ఉందని సచిన్ సంతోషం వ్యక్తం చేశారు. అచ్రేకర్ మనసంతా శివాజీ పార్క్ లోనే ఉండేదని ఆయన దాంట్లోనే జీవితాంతం బతికారని అక్కడే ఎంతో మంది పిల్లలను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దారని సచిన్ గుర్తు చేసుకున్నారు. రమాకాంత్ అచ్రేకర్ శిక్షణలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ నుంచి మొదలుపెట్టి రమేశ్ పవార్, సంజయ్ బంగర్, అజిత్ అగార్కర్ వరకూ మొత్తం 12 మంది ఆటగాళ్లు టీమిండియాకు ఆడారు. ఇంత మందిని భారత క్రికెట్ కు అందించిన ద్రోణాచార్యుడు రమాకాంత్ అచ్రేకర్ ను సముచితంగా గౌరవించాలని ముంబై నగరపాలక సంస్థ శివాజీ పార్క్ ఐదోగేట్ దగ్గర ఆరడుగులు ఎత్తులో ఉండేలా అచ్రేకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. తన శిక్షణతో మేటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన రమాకాంత్ అచ్రేకర్ పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు. 2019లో 87వ ఏట అచ్రేకర్ కన్నుమూశారు.