Harbhajan Singh Sreesanth slapgate | ఐపీఎల్ చరిత్రలో కీలకమైన వీడియో లీక్ చేసిన లలిత్ మోదీ | ABP Desam
2008 ఐపీఎల్ మొదలైన సంవత్సరం అది. లలిత్ మోదీ అనే వ్యక్తి ఆలోచనల్లో నుంచి పుట్టిన ఓ క్రికెట్ ఐడియా కమర్షియల్ రూపం దాల్చి ఈ రోజు వేలకోట్ల వ్యాపారమై కూర్చుంది. తర్వాత లలిత్ మోదీ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చి అతను క్రికెట్ కి దూరం అవ్వటం..దేశం వదిలి పారిపోయి యూకేలో ఎక్కడో బతుకుతున్నాడు అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఆ లలిత్ మోదీ ఐపీఎల్ కు సంబంధించిన ఓ వీడియోను లీక్ చేశాడు. అదే శ్రీశాంత్ ను హర్భజన్ సింగ్ చెంప మీద కొట్టిన సందర్భం. ఐపీఎల్ మొదటి సీజన్ లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. మ్యాచ్ లో జరిగిన ఘటనపై మాట మాటా పెరిగి ఊగిపోయిన హర్భజన్ మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో శ్రీశాంత్ చెంప మీద ఒక్కటి పీకాడు. తిరిగి శ్రీశాంత్ కూడా కొట్టబోగా అప్పటి పంజాబ్ ఆటగాళ్లైన జయవర్ధనే, ఇర్ఫాన్ పఠాన్ లు శ్రీశాంత్ ను అడ్డుకున్నారు. సెక్యూరిటీ వచ్చి హర్భజన్ ను పక్కకు లాక్కెళ్లిపోయారు. మ్యాచ్ తర్వాత జరగటంతో అప్పట్లో ఈ వార్త అయితే బయటకు వచ్చింది కానీ అప్పటి బ్రాడ్ కాస్టింగ్ ఛానల్స్ ఈ ఘటనను మాత్రం వీడియో రూపంలో బయటపెట్టలేదు. ఇన్నాళ్ల తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ కార్క్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఆ వీడియోను తొలిసారిగా బయటపెట్టాడు. క్లార్క్ కూడా హర్భజన్ గొప్ప ఆటగాడని..ఇలా చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డాడు.




















