Aus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam
నిన్న సిడ్నీ టెస్టు మొదటి రోజు టీమిండియా 185 పరుగులకే ఆలౌట్ అయిపోతే హా ఏముందిలో సిరీస్ సమర్పయామి అనుకున్నారు అంతా. కానీ మన బౌలర్లు అలా అనుకోలేదు. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చుక్కలు చూపించారు అంతే. వికెట్ నష్టానికి తొమ్మిది పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. బుమ్రా, సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ కి 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను కొత్త ఆటగాడు వెబ్ స్టర్ ఆదుకున్నాడు. స్టీవ్ స్మిత్, అలెక్సీ కేరీ కాసేపు క్రీజులో నిలబడితే వెబ్ స్టర్ 57పరుగులు చేసి పోరాడటంతో ఆస్ట్రేలియా అతికష్టం మీద 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగు పరుగుల చిన్న లీడ్ తో టీమిండియా ఆట ప్రారంభిస్తే మళ్లీ మన బ్యాటర్ల కష్టాలు షరా మామూలే. జైశ్వాల్, రాహుల్, గిల్ అందరూ ఈ మ్యాచ్ లో నిలదొక్కుకోవాలనే ఇంటెన్షన్ తోనే ఆడినా వికెట్లు మాత్రం కోల్పోయారు. కొహ్లీ మరోసారి 6పరుగులే చేసే మళ్లీ అవుట్ ఆఫ్ స్టంప్ బాల్ కే అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చిన తొలి బంతిని క్రీజు బయటకు వచ్చి సిక్సర్ బాదిన పంత్....సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 33 బాల్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61పరుగులు చేశాడు. పంత్ దెబ్బతో ఆసీస్ బౌలర్లు బిక్కచచ్చిపోగా...భారత్ మంచి టార్గెట్ పెట్టుదనే ధీమాతో కనపడింది. కానీ అనూహ్యంగా పంత్ కూడా అవుటవటం, వెంటనే నితీశ్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లటంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 141పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతానికి లీడ్ 145 పరుగులు..కనీసం మరో వంద పరుగులు చేస్తే కానీ విజయం మీద ధీమాగా ఉండలేని పరిస్థితి ఉంటే..బుమ్రా గాయం కారణంగా ఆసుపత్రికి స్కానింగ్ వెళ్లి రావటం కూడా ఆందోళన కలిగించే అంశం. చూడాలి క్రీజులో సుందర్, జడేజా ఏమన్నా ఆదుకుంటే మిగిలిన పని మన బౌలర్లు చూసుకుంటారు.