Non Veg Rates High: విజయవాడలో చుక్కలను తాకిన మాంసాహార ధరలు
సంక్రాంతి సీజన్ కావడంతో మాంసాహారం ధరలకు ఒక్క సారిగా రెక్కలు వచ్చాయి. కనుమ పండుగ కావడంతో చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. కరోనాను సైతం లెక్క చేయకుండా మాంసాహార ప్రియులు మార్కెట్‌కు పోటెత్తారు. విజయవాడ లోనే అతి పెద్ద మార్కెట్ గా పేరుగాంచిన బీసెంట్ రోడ్డు హనుమంతరాయ చేపల మార్కెట్ లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.ధరలను కూడా లెక్కచేయకుండా జనం నాన్‌వెజ్ కోసం ఎగబడ్డారు. కనుమ రోజు మాంసాహారం తినడం సంప్రదాయం కావడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచి కొనుగోలు దారులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి . నిన్న మొన్నటి వరకు 150 నుంచి 180 మధ్య బాయిలర్ చికెన్ ఒక్కసారిగా 230 కి చేరింది.ఇక మటన్ కిలో 750 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెరిగిపోయింది. రొయ్యలు హోల్‌సేల్ మార్కెట్ లోనే 300 పలకగా రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి 400 వరకు పలికింది నాటుకోడి సంగతి సరే సరి. మామూలు రోజుల్లోనే ఎక్కువగా ఉండే నాటు కోడి మాంసం కూడా కిలో 800 పై మాటే. సంక్రాంతి పండుగ రోజు నాటుకోడి రుచి చూడాలన్నది తెలుగువారి సంప్రదాయం కావడంతో నాటు కోళ్ల కు బాగా గిరాకీ పెరిగింది. ఇక చేపలు పీతలు వంటి ఇతర మాంసాహారాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నాన్ వెజ్ ధరల పట్ల కొనుగోలుదారులు ఆగ్రహం చెందినా ఏడాదికోసారి వచ్చే పండుగ కావడంతో గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ఖర్చు ఒకింత ఎక్కువే అయినా ఇంటికి వచ్చే అల్లుళ్లకు ఎలాంటి లోటు రానీయకూడదు కదా అంటూ మరికొందరు సర్ది చెప్పుకుంటున్నారు.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

