NEET-PG: నీట్-పీజీ ప్రవేశాలపై సుప్రీం స్పష్టత
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్- పీజీ ప్రవేశాల్లో ఓబీసీలకు 27% శాతం, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు 10 శాతం కోటాను సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన ఆదాయ పరిమితిపై మార్చి 5న తుది తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏ ఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రకటించింది. ఇంతకుముందు జరిగిన విచారణలో భాగంగా ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను కొనసాగించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. సవరించిన నిబంధనలను వచ్చే ఏడాదికి వర్తింపజేయవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు ₹8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని నీట్-పీజీ అభ్యర్థులు కొందరు సుప్రీంలో సవాల్ చేశారు. ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలను ఈ పరిమితి నుంచి మినహాయించింది.