Minister Peddireddy: ఎన్ని దారులున్నా వెళ్లేది దేవుడి దగ్గరికే...!
ఎన్ని మార్గాలైనా దేవుని దర్శనం కోసమే వెళ్తాం కనుక... అన్నమయ్య మార్గంను ప్రత్యామ్నాయంగా భావించాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పేరూర్ వద్ద గల మాతృశ్రీ వకుళా మాత ఆలయాన్ని మంత్రి పరిశీలించారు. సొంతనిధులపై నిర్మిస్తున్న ఆలయ అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా పేరూరు చెరువు నిండి ఆలయం పరిసర ప్రాంతాలు వరద నీటిలో నిండి పోవడంతో ఆలయ పునరుద్దరణ పనులు మూడు నెలల పాటు ఆలస్యం అయిందన్నారు. తిరుమలకు మూడో మార్గంగా అన్నమయ్య మార్గానికి టీటీడీ అఫిషియల్‌గా అనుమతించిందని పత్రికల్లో చూశానని, ఎన్ని మార్గాలైనా దేవుని దర్శనం కోసమే కనుక పురాతన మార్గాలను పునరుద్ధరించడం మంచి ఆలోచనగా తను భావిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.