Suravaram Sudhakar Reddy Passed Away | తుదిశ్వాస విడిచిన సురవరం సుధాకర్ రెడ్డి | ABP Desam
కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. నల్గొండ కు రెండు సార్లు ఎంపీగా సేవలు అందించిన సురవరం...సాధారణ కమ్యూనిస్టు కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ అన్ని పదవులనూ అలంకరించారు. తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా సీపీఐ నిర్ణయంలో తీసుకోవటంలో కీలకపాత్ర పోషించటం, విద్యుత్ ఛార్జీల కోసం చంద్రబాబు ప్రభుత్వం పైన చేసిన పోరాటం సురవరంకు కమ్యూనిస్టు పార్టీలో బలమైన స్థానాన్ని కట్టబెట్టాయి. జోగులాంబ జిల్లా కంచుపాడుకు చెందిన సుధాకర్ రెడ్డి..అమ్మమ్మ గారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లి 1942 మార్చి 25న జన్మించారు. స్కూలు చదువుల కోసం కర్నూలుకు వెళ్లి 15ఏళ్ల వయస్సులో పుస్తకాల కోసం బడి విద్యార్థులతో కలిసి పోరాటం చేయటంతో ఆయనలోని విప్లవ పోరాటయోధుడు తొలిసారి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి కర్నూలుకు ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి, తిరుపతి ఎస్వీ యూనిర్సిటీ సెక్రటరీగా, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతూ కమ్యూనిస్టు సంఘాలకు నేతృత్వం వహించారు. తొలుత ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినా నల్గొండ నుంచి 1988ఎన్నికల్లో, 2004లో ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2012 నుంచి 2019 వరకూ సీపీఐ పార్టీలో అత్యున్నత స్థానమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో రాజకీయ జీవితానికి ముగింపు పలికారు. చివరిసారిగా ఆసుపత్రి నుంచి వీల్ ఛైర్ లోనే ఆయన పార్టీ కార్యవర్గ సమావేశాలకు హాజరై పార్టీకి తనెంత విధేయుడో చాటుకున్నారు. సురవరం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.





















