ఫిలడెల్ఫియాలో ఆసక్తికర సంఘటన...ఆటోపైలెట్ కారులో ప్రసవం
అంబులెన్సులో...ఆసుపత్రిలో డెలివరీ కావటం కామన్. కానీ ఓ టెస్లా కారులో ఓ తల్లి తన బిడ్డకు జన్మనిచ్చింది. ఆటోపైలట్ ఎలక్ట్రిక్ కారు కావటంతో ఆసుపత్రికి వెళ్తూనే....శిశువుకు జన్మనివ్వటం జీవితంలో మరిచిపోలేని అనుభూతని ఆ దంపతులు ఆనందంగా చెబుతున్నారు. ఫిలడెల్ఫియాకు చెందిన 33ఏళ్ల ఇరాన్ షెర్రీ, తన భర్త 34ఏళ్ల కీటింగ్, తన మూడేళ్ల కుమారుడు రఫా తో కలిసి బయటికి వెళ్తుండగా అకస్మాత్తుగా నొప్పులు రావటం ప్రారంభమయ్యాయి. తమ కుమారుడిని స్కూల్ లో దింపేసి ఆసుపత్రికి వెళ్దామనుకున్నా వెళ్లాల్సిన దారి పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయింది. మరో దారి ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించగా...నొప్పులు ఈ లోపు ఎక్కువయ్యాయి. కారు ఆటో పైలట్ ఆన్ చేసుకుని....తన భార్య ప్రసవించేందుకు సహాయపడ్డారు కీటింగ్. ఓ వైపు కారు దానంతట అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా....మార్గమధ్యంలోనే ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది షెర్రీ. ఆసుపత్రికి చేరుకోగానే వైద్యసిబ్బంది ఆమెకు చికిత్సనందించారు. టెస్లా ఆటో పైలట్ కారుతో తమ అనుభవాలను పంచుకుంటూ ఆ దంపతులు చెబుతున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సక్రమంగా ఉపయోగించుకుంటే టెక్నాలజీతో నిజంగా ఎన్ని లాభాలో కదా...!