Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
అప్పట్లో జగన్ అయినా.. చంద్రబాబు అయినా కూడా ముఖాముఖీగా వాళ్ల నియోజకవర్గాలను కూడా ఓడిస్తామని సవాల్ చేశారు. అది జరగలేదు కానీ.. ఏడాది తర్వాత పులివెందులలో వైసీపీని టీడీపీ చావు దెబ్బ కొట్టింది. వైఎస్ కుటుంబానికి ఓటమంటే తెలియని పులివెందులలో అదీ ఆ మండలంలో వైసీపీని డిపాజిట్ కూడా రాకుండా ఓడించడం వెనుక చాలా సంగతే ఉంది. క్యాడర్ కష్టపడిందా.. అధికారంతో అక్రమాలు చేసిందా.. ప్రత్యర్థులను భయపెట్టిందా.. లేక జగన్‌పైనే వ్యతిరేకత వచ్చిందా.. ఇలా ఎన్నిరకాల వాదనలున్నా.. సరే మొత్తానికి ఆన్ రికార్డ్ టీడీపీ అక్కడ గెలిచింది. దీనికి కారణం కుప్పం..
కుప్పంలో వైఎస్సార్సీపీ చేసిందే ఇక్కడ జరిగిందా..?
సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు అంత దృష్టి పెట్టవ్.. వాళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేత నియోజకవర్గంలో రాజకీయ ఫిరాయింపులని ప్రోత్సహించడం లాంటివి కూడా చేయరు.. అదంతా వైఎస్ చంద్రబాబు జమానా వరకూ సాగింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2017లో కడప జిల్లాలో బీటెక్ రవిని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ గెలిపించుకోగలిగింది. చంద్రబాబు తన జిల్లాలో రాజకీయం చేస్తే.. జగన్ ఏకంగా ఆయన నియోజకవర్గంలోనే చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీతో పాటు.. నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలను.. ఎంపీటీసీలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు రివర్స్ ఎటాక్ చేశారు. ఏకంగా పులివెందులనే కొట్టారు.





















