Visakha TTd Temple: విశాఖ సాగర తీరంలో కొలువుతీరనున్న శ్రీనివాసుడు.. సుముహూర్తం త్వరలోనే!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.. విశాఖ సాగరతీరంలో కొలువుదీరుతున్నారు. నగరంలోని రిషికొండపై సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న ఈ దేవాలయం కోసం ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించింది. 10 ఎకరాల్లో ఏర్పాటుచేసిన దేవాలయంలో ఈ నెల 11న శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ట జరగనుంది.
8న తేదీన అంకురార్పణ, 13వ తేదీన సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత 13వ తేదీ మధ్యాహ్నం నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. 28 కోట్ల రూపాయల వ్యయంతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల ఆలయ నమూనాలో తీర్చిదిద్దింది టీటీడీ. ఒకవైపు సాగరం మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు సాగం తీరం మరింత ప్రియంకానుంది.
తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీవారికి పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం, టీటీడీ ఈ-దర్శనం కౌంటర్ ఏర్పాటుచేశారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆలయ పనులు పూర్తి అవ్వడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు ఆలయ నిర్వాహకులు. వివిధ కారణాల వల్ల తిరుమల వెళ్లలేనివారు, విశాఖలోనే దేవదేవుడుని దర్శించుకోవచ్చు. శ్రీవారి ప్రసాదాలు పొందవచ్చు. మెుత్తంగా తిరుమల వెంకన్న విశాఖలోనే దర్శనం ఇవ్వనుండటంతో భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

