Tamilnadu News: రూ.10 కోసం నడి రోడ్డుపై స్నానం, వాహనదారుడికి రూ. 3,500 ఫైన్ తో షాకిచ్చిన పోలీసులు
Tamilnadu News: తమిళనాడులోని ఈరోడ్ లో నడిరోడ్డుపై స్నానం చేసిన వ్యక్తి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
Tamilnadu News: సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఫేమస్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ టాలెంట్ ప్రదర్శించి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మరికొందరు వింత చేష్టలతో ఫేమస్ అయిపోవాలని తపిస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తూ వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా, ఫేస్‌బుక్ రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు మాత్రం పిచ్చి పిచ్చి చేష్టలతో ఓవర్ నైట్ లో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బిజీగా ఉండే రోడ్లపైకి వచ్చి స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కూటీలపై బకెట్ లో నీళ్లు తీసుకుని బిజీగా ఉండే రోడ్లపైకి వస్తున్నారు. సిగ్నల్ పడగానే మగ్గుతో ఒంటిపై నీళ్లు పోసుకుంటూ అక్కడే సబ్బు పెట్టుకుని స్నానం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలకు సోషల్ మీడియాలో బాగానే వ్యూస్ వస్తుండటంతో ఒకరి తర్వాత మరొకరు ఈ ట్రెండ్ ఫాలో అవుతూ రీల్స్ చేస్తున్నారు. ఈ ఇలాంటి వికృత చేష్టలతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎంటర్‌టైన్ చేస్తున్నామని చెబుతూ అక్కడి వ్యక్తులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. అలాంటి 'బాతింగ్ ఆన్ రోడ్' వీడియో చేసిన ఓ వ్యక్తికి తమిళనాడు పోలీసులు ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రూ.10 బెట్ కోసం రూ.౩,500 ఫైన్
తాజాగా తమిళనాడులోని ఈరోడ్ లో ఎం ఫరూక్ (24) అనే యువకుడు నడి రోడ్డుపై స్నానం చేయడంతో తమిళనాడు పోలీసులు అతడిని గుర్తించి ఫైన్ వేశారు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఎం. ఫరూక్ ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన ఫాలోవర్స్ ను ఎంటర్‌టైన్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. పచ్చి చేపలను తినడం, చక్కెరకు బదులు ఉప్పు వేసిన టీ తాగడం, రోడ్లపై నిద్రపోవడం లాంటి తన ఫాలోవర్స్ విసిరే ఛాలెంజెస్ చేస్తుంటాడు. తాజాగా రూ. 10 బెట్టింగ్ కోసం నడిరోడ్డుపై స్నానం చేసేందుకు సిద్ధమయ్యాడు. నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే ఈరోడ్ లోని పన్నీర్ సెల్వం పార్క్ జంక్షన్ వద్ద స్కూటీపై వచ్చాడు. వెంట బకెట్ లో నీళ్లు తెచ్చుకున్నాడు. సిగ్నల్ పడగానే స్నానం చేయడం మొదలు పెట్టాడు. ఇదంతా తనతో పాటు వచ్చిన వారు వీడియో తీశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. తోటి వాహనాదారులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎం ఫరూక్ ను గుర్తించి తనపై రూ.3,500 ఫైన్ వేశారు.
'ఆదివారం రోజు ఫరూక్ పన్నీర్ సెల్వం పార్క జంక్షన్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. అక్కడే ఉన్న వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే ఎండల నుండి ఉపశమనం కోసం నీళ్లు పోసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చాడు. ఇదంతా తనతో పాటు వచ్చిన వారు రికార్డు చేశారు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు' అని స్థానిక డీఎస్పీ జి.జవహార్ తెలపారు.