Rahul Gandhi: దేశానికి సంబంధించినవే కాదు కాంగ్రెస్ కార్యక్రమాలకూ రాహుల్ డుమ్మా - నాయకత్వ సామర్థ్యం ఇంతేనా ?
Rahul : ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పాత్ర ప్రశ్నార్థకం అవుతుంది. కీలకమైన కార్యక్రమాల్లో ఆయన జాడ కనిపించడం లేదు.

Rahul Gandhi Leadership Questioned: భారత ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత ప్రాధాన్యత ఉందో.. ప్రతిపక్షానికి అంతే ఉంది. దేశానికి.. దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రధానమంత్రే కాదు ప్రతిపక్ష నేత పాల్గొనడం కూడా సంప్రదాయం. అయితే అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో రాహుల్ కనిపించడం లేదు. ఆయన తీరు కాంగ్రెస్ పార్టీలోనే చర్చనీయాంశమవుతోంది.
మహాకుంభమేళాలో కనిపించని రాహుల్ గాంధీ
ప్రస్తుతం దేశంలో అతి పెద్ద ఈవెంట్ కుంభమేళా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు.. ఇతరులుకూడా వచ్చి పుణ్యస్నానం చేస్తున్నారు. ఇది 144 ఏళ్లకు ఓ సారి వచ్చే ఉత్సవం. ఇలాంటి ఉత్సవంలో పుణ్య స్నానం చేసేందుకు అందరూ వస్తున్నారు.ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా భక్తి భావనతో పుణ్యస్నానం చేశారు.కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుంభమేళా గురించి ఎక్కడా స్పందించడం లేదు. పుణ్యస్నానం గురించి కూడా మట్లాడటం లేదు. రాహుల్ గాందీ తీరు వల్ల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరినట్లయింది. గణేష్ చతుర్థి, నవరాత్రి వంటి ఉత్సవాల్లోనూ ఆయన కనిపించరు.
జాతీయ సమైక్యను చాటేందుకు అవకాశం - రిపబ్లిక్ డే వేడుకల్లో కనిపించని ప్రతిపక్ష నేత
రిపబ్లిక్ డే వేడుకలు అంటే పూర్తిగా దేశానికి సంబంధించినవి. ఆ వేడుకల్లో పాల్గొనడం ఓ గౌరవం. అయితే ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కనిపించలేదు. ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ఇలా గణతంత్ర వేడుకలకు రాహుల్ హాజరు కాకపోవడం .. చాలా పెద్ద తప్పిదమన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్యాంగంపై గౌరవం లేకపోవడం అన్న విమర్శలు వస్తున్నాయి. జాతీయంగా సమైక్యత చూపే అవకాశం వచ్చినా ఆయన కాలదన్నారని అంటున్నారు.
రాజ్యాంగపరమైన వేడుకలకూ దూరం
2022లో జరిగిన రాజ్యాంగ దినోత్సవానికి కూడా ఆయన హాజరు కాలేదు. అప్పట్లో అగౌరవంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆయన అవమానించారు.
కాంగ్రెస్ విజయాలు, ఉత్సవాల్లోనూ కనిపించని వైనం
రాహుల్ గాంధీ చివరికి తన పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించరు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ విజయం సాధించినా ఎక్కడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న దాఖలాలు లేవు. ఓ నాయకుడిగా ఆనందం వ్యక్తం చేయకపోతే కార్యకర్తల్లో నిరాశా నిస్ప్రృహలు వస్తాయి. బెళగావిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీని గౌరవించే కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు.
ఓ ప్రతిపక్ష నేత.. జాతీయ పార్టీకి కీలకంగా ఉండే నేత వరుసగా కీలకమైన కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం ఆయన నాయకత్వ లేమికి సాక్ష్యంగా కనిపిస్తోంది.చివరికి కాంగ్రెస్ పార్టీకి తాడోపేడో లాంటి ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం పరిమితంగా సాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డీలా పడ్డారు. పార్టీకి నాయకత్వం వహించడం ఈ పద్దతి కాదని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై పెదవి విరుస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

