KTR Vs Revanth Reddy: "నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు" కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR Vs Revanth Reddy: ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ రేసు కేసులో తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ కామెంట్ చేశారు. తాను ఇప్పటికీ లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు.

KTR Vs Revanth Reddy: ఫార్ములా ఈ రేసు కేసులో తనను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని కామెంట్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి నడుపుతున్న జాయంట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. వాళ్లు ఎవరిపైనైనా కేసులు పెడతారని అసత్య ఆరోపణలు చేస్తారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చారు.
తప్పు చేయలేదు కాబట్టి అరెస్టు చేయలేరు: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో చాలా విషయాలు ప్రస్తావించారు. ఫార్ములా ఈ రేసుకేసులో ఏం లేదని రేవంత్ రెడ్డితోపాటు అందరికీ తెలుసని అన్నారు. అందుకే ఆ కేసులో తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరని అన్నారు. ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని అన్నారు. మీడియా సమక్షంలోనే తనకు, రేవంత్ రెడ్డికి లైడిటెక్టర్ పరీక్షలు చేయాలని ఛాలెంజ్ చేశారు. ఇదే విషయంలో తాను ఎన్నిసార్లు సవాల్ చేసినా రేవంత్ రెడ్డి స్పందించలేదని అన్నారు.
బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వాళ్లపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని అన్నారు కేటీఆర్. ఈ విషయం తెలిసే ఇప్పుడు రాజీనామాలు అంటు కొత్త డ్రామాకు తెర తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ముందు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై వేటు తప్పదని అన్నారు. ఇక్కడ కడియం శ్రీహరిని రక్షించేందుకు దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలనే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఆ పది స్థానాలకు ఉపఎన్నికలు రావడం ఖాయమన్నారు. ముందు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తాయని ఆ తర్వాత పది స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని తెలిపారు.
రాజధానిలో ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం: కేటీఆర్
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల రేగులరైజేషన్ పేరుతో ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్‌కు రేవంత్ రెడ్డి తెరలేపారని ధ్వజమెత్తారు. "ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం. పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేరుతో కొత్త పాలసీ అంటూ భారీ కుంభకోణానికి రేవంత్ తెర లేపారు. దేశంలో చరిత్రలో అతిపెద్ద ఐదు లక్షల కోట్ల రూపాయల భూములకు కుంభకోణం కాంగ్రెస్ పాల్పడుతోంది.హైదరాబాద్ నగరంలో ఉన్న 9,292 ఎకరాల భూమిపై రేవంత్ కన్నేశారు. కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈ పాలసీ ద్వారా కుంభకోణం చేయబోతున్నారు. గతంలో మా ప్రభుత్వం కనీసం 100% నుంచి అత్యధికంగా 200% ఎస్ఆర్ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశిస్తే కాంగ్రెస్ కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అంటూ కొత్త పాలసీ తెచ్చింది. క్యాబినెట్ మీటింగ్‌లో ఈ భారీ స్కామ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అనుచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే ఆగమేఘాల మీద కేవలం ఏడు రోజుల్లో దరఖాస్తు, ఏడు రోజుల్లో ఆమోదం, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు ఏటీఎంగా మారింది." అని అన్నారు.
ఈ భూములు తీసుకున్న వారికి చిక్కులు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నారు. "ఈ భూములు కొనుగోలు చేసిన, రెగ్యులరైజ్ చేసుకున్న పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ప్రజల ఆస్తిని అప్పనంగా కొట్టేస్తామంటే కుదరదు. ఈ అంశంలో బిఆర్‌ఎస్ పార్టీ అవసరమైతే న్యాయపోరాటం చేస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లావాదేవీలన్నింటిపైన పూర్తి విచారణ ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కేవలం రేవంత్ రెడ్డి అవినీతి కోసం ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులు పడవద్దు. పరిశ్రమలు తీసుకువచ్చేందుకు రూపొందించిన టి.ఎస్‌ఐపాస్ విధానాన్ని పారిశ్రామిక భూములు అమ్మేందుకు కాంగ్రెస్ వాడుతోంది." అని వార్నింగ్ ఇచ్చారు.





















