Case On Actor Venu: సినీ హీరో వేణుపై కేసు పెట్టిన సీఎం రమేష్ - కాంట్రాక్టుల్లో వచ్చిన తేడాలే కారణం !
Venu Vs CM Ramesh: హీరో వేణుపై సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కేసు పెట్టింది. ఓ కాంట్రాక్ట్ విషయంలో మోసం చేశారని కోర్టులో పిటిషన్ వేశారు.

Case On Actor Venu: సినిమా నటుడు తొట్టెంపూడి వేణుపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది. తొట్టెంపూడి వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అయితే పనులు ప్రారంభమైన తర్వాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మధ్యలోనే వైదొలిగింది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఇలా రద్దు చేసుకోవడం వల్ల తమకు భారీ నష్టం కలిగించారని వీరిపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి చెందినది.ఈ కంపెనీని ఆయన సోదరుడు నిర్వహిస్తూ ఉంటారు. కాంట్రాక్టులను చేయడంలో ఈ సంస్థకు మంచి పేరు ఉంది. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ ఉంటుంది. హీరో తొట్టెంపూడి వేణు ప్రముఖ కాంట్రాక్టర్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సమీప బంధువు. ఆయన కుటుంబం కూడా ఏపీకి చెందిన రాజకీయ కుటుంబం అని చెబుతారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆయన కాంట్రాక్టుల వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రిత్విక్ ప్రాజెక్ట్స్ తో కలిసి జాయింట్ వెంచర్స్ ప్రారంభించి.. మధ్యలో వైదొలగడం వివాదాస్పదమయినట్లుగా కనిపిస్తోంది.
వేణు తొట్టెంపూడి, హేమలత, పాతూరి ప్రవీణ్, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ భాస్కర్ రావు, శ్రీవాణి లు కలిసి ఉత్తరాఖండ్ లోని జలవిద్యుత్ ప్రాజెక్టు కి సంబంధించిన కొన్ని పనులను చేయడం కోసం తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకున్నారు. అయితే ఈ పనులు పూర్తి చేయడం కోసం సబ్ కాంట్రాక్టార్లుగా బంజారాహిల్స్ లోని రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ని తీసుకున్నారు. 2002లో కేవలం రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మాత్రమే ఈ పనులు మొదలు పెట్టింది. అయితే సడన్ గా టీహెచ్డీ,ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థల మధ్య విభేదాలు తలెత్తడంతో బయటకు వెళ్లిపోయారు. అక్కడ డబ్బు లావాదేవీలు తేడా వచ్చాయి.
సాధారణంగా ఇలాంటి కార్పొరేట్ వ్యవహారాలు వెలుగులోకి రావు . వీలైనంత వరకూ సామరస్యంగా పరిష్కరించుకుంటారు . అయితే రిత్విక్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ మధ్య పరిస్థితి అంత సానుకూలంగా లేకపోవడంతో చర్చలు కూడా విఫలమయ్యాయని అందుకే రిత్విక్ ప్రాజెక్ట్స్ కోర్టుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వేణు ఇటీవల మళ్లీ నటన ప్రారంభించారు. ఓ వెబ్ సిరీస్ నటించారు. కొొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు అంశంపై తొట్టెంపూడి వేణు కానీ.. రిత్విక్ ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
Also Read: హాయ్ నాన్న... కన్నడ సినిమాకు కాపీనా? కన్నడ నిర్మాత ఇన్‌స్టా స్టోరీ గొడవ ఏంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

