Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
Mallanna : తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. అయితే తనకు నోటీసులు పంపడంపై ఆయన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Congress Disciplinary Committee sent notices to Tinmar Mallanna: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ మల్లన్న తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని సామాజికవర్గాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. కులగణన నివేదికకు ఆయన నిప్పు పెట్టడంతో దుమారం రేగింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రారంభమయింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చిన వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్దమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంకేతాలు పంపుతోంది.
అయితే తనకు నోటీసులు జారీ చేయడంపై తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీలదని.. బీసీలను బయటకు పంపుతారా అని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీని బీసీలు పండబెట్టి తొక్కుతారని హెచ్చరించారు.షోకాజ్ నో టీసులు జారీ చేసినా ఆయన ఇలా మాట్లాడుతూండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇక చర్యలు తీసుకోక తప్పని పరిస్థితుల్లో పడింది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రిని, సొంత ప్రభుత్వాన్ని, సొంత పార్టీని విమర్శిస్తున్నారు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ . ఇటీవల బీసీ వర్గాల సమావేశాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గె్ట చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని మల్లన్న జోస్యం చెప్పారు. వరంగల్ బీసీ సభకు ఆయన హెలికాఫ్టర్ లో హాజరయ్యారు. అక్కడ ఘోరమైన బాషతో విరుచుకుపడ్డారు. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదన్నారు. ఇతర కులాల్ని టార్గెట్ చేసి ఆయన ఘాటు భాషను వాడారు.
ఈ ఒక్క విషయంలోనే కాదు.. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తీన్మార్ మల్లన్న వ్యతిరేకించారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము రెడ్లకు ఉందా అని ప్రశ్నించారు. అంతకు ముందు గ్రూప్ వన్ విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కులగణన రిపోర్టుపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ శ్రేణుల్ని కూడా అసంతృప్తికి గురి చేస్తోంది. తీన్మార్ మల్లన్నకు సీఎం కావాలన్న లక్ష్యం ఉంది. అందుకే తాను బీసీ కావడమే ప్లస్ పాయింట్ గా పెట్టుకున్నారని చెబుతున్నారు.ఈ క్రమంలో ఆయనను భరిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టమని అగ్రనేతలు భావిస్తున్నారు.





















