Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
Telangana : హైదరాబాద్ లో పలు చోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. హాస్టల్ భవనంపై నుంచి దూకి ఓ యువత ఆత్మహత్య చేసుకోగా.. మరో ఘటనలో గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు.

Telangana : తెలంగాణలోని వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్ భవనంపై నుంచి దూకి పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. మరో పక్క హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు.
హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
గచ్చిబౌలిలోని సిద్ధిక్ నగర్ లోని ఓ హాస్టల్ భవనంపై నుంచి దూకి పశ్చిమ బెంగాల్ కు చెందిన రితోజి బసు అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తర్వాత శవ పరీక్ష నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ సెల్లార్‌లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలింది. దీంతో మట్టిపెడ్డల మీద పడి ముగ్గురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసి, చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. కాగా చనిపోయిన వారి మృతదేహాలను సైతం రెస్క్యూ సిబ్బంది వారిపై పడ్డ మట్టి దిబ్బలను తొలగించి బయటకు తీశారు. ప్రాథమిక వివరాల ప్రకారం, ఓ భవన నిర్మాణానికి సంబంధించి ఇక్కడ సెల్లార్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించిన సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్
అంతకుముందు ఫిబ్రవరి 4న రాత్రి చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రసాయనాల ఘాటుతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.





















