Shamshabad Airport : తిరుపతికెళ్లే విమానం క్యాన్సిల్ చేసిన అధికారులు - శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తిరుపతికి వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక లోపంతో రద్దు చేశామని చివరి నిమిషంలో చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shamshabad Airport : హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అకస్మాత్తుగా తాము వెళ్లాల్సిన విమానాన్ని అధికారులు క్యాన్సిల్ చేయడంతో ప్యాసెంజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషయంలో తమకు సమాచారమిచ్చారని ఆరోపించారు. ఈ రోజు ఉ.5.30 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఎయిర్ వేస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన అధికారులు.. ప్రయాణానికి కొద్ది సేపటి ముందు ఈ విషయం గురించి ప్రయాణికులకు సమాచారమిచ్చారు. దీంతో ప్రయాణికులు నిరసనకు దిగారు.
అప్పటివరకూ విమానం కోసం ఎదురుచూసిన ప్యాసెంజర్స్ కు ఆఖరు నిమిషంలో సిబ్బంది చెప్పిన కారణంతో వారు మండిపడ్డారు. అయినా చివరి నిమిషంలో ఇలా లోపం అంటే ఎలా.. ముందే చూసుకోవాలి కదా అంటూ విరుచుకుపడుతున్నారు. ఎయిర్ జర్నీ నిమిత్తం దాదాపు 4 గంటల నుంచి ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్తున్న తాము.. దర్శన సమయం దాటిపోతోందని చెప్పారు. తమను వెంటనే తిరుపతికి పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా ఈ విమానం 47 మందిలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్
కొన్ని రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఓ వ్యక్తి సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందని చెప్పడంతో.. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ నుంచి కాల్ వచ్చిందో తెలుసుకున్న భద్రతా సిబ్బంది.. దీన్ని ఫేక్ కాల్‌గా తేల్చారు. ఆ కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసి అని, నిందితుడికి మతిస్థిమితం లేదని అధికారులు గుర్తించారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.





















