Telangana phone tapping case: తర్వాత కేసీఆర్‌కే నోటీసులు - బీఆర్ఎస్ అనుమానం - సంచలనాలు ఉంటాయా?
Tapping case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు నమోదు కానున్నాయి. కేసీఆర్ కు నోటీసులు అందవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Telangana phone tapping case : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగియడంతో, తదుపరి అడుగులు నేరుగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు పడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. దర్యాప్తు సంస్థలు సేకరించిన సాంకేతిక ఆధారాలు, అరెస్టయిన అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ ప్రక్రియ ఇప్పుడు గులాబీ బాస్‌ను చుట్టుముట్టేలా కనిపిస్తోంది.కేటీఆర్ కూడా .. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సజ్జనార్ వ్యూహం - కేసీఆర్ టార్గెట్
పెద్ద స్థాయి నేతలను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విచారించాలంటే దానికి తగిన ధైర్యం, పక్కా ప్రణాళిక ఉన్న అధికారి అవసరమని భావించిన ప్రభుత్వం, ఐపీఎస్ అధికారి సజ్జనార్ రంగంలోకి దించినట్లుగా కనిపిస్తోంది. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే హరీష్ రావును ఏడున్నర గంటల పాటు విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో లభించిన వివరాలను గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లతో సరిపోల్చిన తర్వాత, ఈ వారం చివర్లో లేదా వచ్చే వారం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సాంకేతిక ఆధారాలే కీలకం
కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా నిరూపించే బలమైన సాంకేతిక ఆధారాలను సిట్ సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక డేటా డిలీట్ చేసినా, విదేశీ నిపుణుల సహాయంతో దాన్ని రికవరీ చేసినట్లు చెబుతున్నారు. ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎవరి ఆదేశాల మేరకు విపక్ష నేతల ఫోన్లు రికార్డ్ అయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ విచారణతోనే కొలిక్కి వస్తుందని పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశాలుఉన్నాయి.
బీఆర్ఎస్ ఆందోళన - రాజకీయ సెగ
కేసీఆర్‌కు నోటీసులు అందవచ్చనే వార్తలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిని ముందస్తుగానే పసిగట్టిన పార్టీ అగ్రనేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురుదాడి పెంచారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అని, హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే, అది తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది. అటు న్యాయపరంగా ఎదుర్కోవడంతో పాటు, ఇటు ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సజ్జనార్ నేతృత్వంలోని విచారణ వేగం చూస్తుంటే, వచ్చే కొద్ది రోజుల్లో మరిన్ని సంచలనాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















