Weather Latest Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, దానికి తోడు మరో ఆవర్తనం కూడా - ఐఎండీ వెల్లడి
ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘‘ఈ రోజు అవర్తనం బంగాళాఖాతంలోని మధ్య భాగాలు, పరిసరాల్లోని ఉత్తర బంగాళాఖాతంలో ఉంది. ఈ అవర్తనం ప్రభావం వలన రాగల 24 గంటల్లో వాయువ్య, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తరువాత ఇది బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈరోజు మరొక ఆవర్తనం బంగాళాఖాతంలోని మధ్య భాగాలు & పరిసరాల్లోని ఉత్తర బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 4.5 కిలో మీటర్లు, 7.6 కిలో మీటర్ల మధ్య కొనసాగుతుంది. ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు భారీ వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో (తూర్పు) అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రములో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని తూర్పు, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 06 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చు.
‘‘బంగాళాఖాతంలో నిన్న ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం నేడు బలపడి అల్పపీడనంగా మారనుంది. దీని వలన నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో - శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు నేడు కనిపిస్తోంది. నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే సాయంకాలం లోపల విశాఖ నగరంలో భారీ వర్షాలను చూడగలం. నేడు వర్షాలు విస్తారంగా, ఎక్కువ సేపు విశాఖలో వర్షాలు ఉంటాయి. రేపు ఉదయం కూడా ఉత్తరాంధ్రలో వర్షాలను చూడగలం. నేడు సాయంకాలం సమయం వరకు మధ్య ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలం. గోదావరి జిల్లాల్లో కూడ నేడు మధ్యాహ్నం - సాయంకాలం అక్కడక్కడ వర్షాలు, పిడుగులు ఉంటాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో చెదురుముదురుగానే వర్షాలను చూడగలం.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.