VRA Strike Vikarabad: ధర్నాలో పాల్గొని గుండెపోటుకు గురైన వీఆర్ఏ, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి
VRA Strike Vikarabad: దాదాపు 60 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, భార్యా పిల్లలను ఎలా పోషించుకోవాలనే ఆవేదనతో... తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వీఆర్ఏ గుండెపోటుకు గురై మృతి చెందారు.
VRA Strike Vikarabad: పే స్కేల్ పెరుగుతుందో లేదో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి.. ఎన్నాళ్ల పాటు ఇలా ధర్నా, రాస్తారోకో చేయాలో అర్థంకాక తీవ్ర మనస్తాపానకి గురయ్యాడో వీఆర్ఏ. ఈ టెన్షన్ వల్లే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన వీఆర్ఏ రాజు మనస్తాపంతో మృతి చెందాడు. సమస్యలు పరిష్కరించాలంటూ నెలల తరబడి సమ్మె చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపంతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఇదివరకే పలు జిల్లాల్లో వీఆర్ఏ తమ భవితవ్యం ఏమిటో, పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో స్పస్టత లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు తమ సమస్యల సాధనకు ధర్నాలో పాల్గొంటున్న వారు సైతం ప్రాణాలు వదలడం వారిలో ఆందోళనను పెంచుతోంది.
అయితే మృతి చెందిన వీఆర్ఏ రాజు స్వస్థలం వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ గ్రామం. సమ్మె మొదలైనప్పటి నుంచి రాజు చురుకుగా పాల్గొంటున్నారు. కాగా గత రాత్రి తీవ్ర మనోవేదనకు గురైన రాజుకు గుండె నొప్పి వచ్చింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు... వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వీఆర్ఏ జేఏసీ డిమాండ్ చేస్తోంది. పే-స్కేల్ జీవో విడుదల చేయడంతో పాటు ఉద్యోగ క్రమబద్దీకరణ చేయాలంటూ గత 60 రోజులుగా వీవీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలుచేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చారు. పే స్కేల్ అమలు చేస్తే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని వీఆర్ఏ ఆశ పడ్డారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారు. ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ ఆ హామీలు అమలుకాలేదని వీఆర్ఏలు ఆందోళన బాటపట్టారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని వీఆర్ఏలు విమర్శలు చేస్తున్నారు.
వీఆర్ఏల సమ్మెబాట..
సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగి నేటికి 60 రోజులు పూర్తయింది. వీఆర్‌ఏలు సమ్మెకు వెళ్లడంతో అప్పటి నుంచి ప్రభుత్వం రూ. 10,500 గౌరవ వేతనం కూడా నిలిపేసింది. రెండు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగం ఉంటుందో ఉండదో ఆందోళన చెందుతున్నామన్నారు. ఇప్పటి వరకూ 28 మంది వీఆర్‌ఏలు చనిపోయారని వీఆర్ఏ సంఘాలు అంటున్నాయి. తాజాగా మరో వీఅర్ఏ మృతి చెందారు.
అసెంబ్లీ సమావేశలప్పుడు వీఆర్ఏలతో కేటీఆర్ చర్చలు..
వీఆర్ఏల ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న వారిలో కొంత మందిని అసెంబ్లీ ప్రాంగణంలోనికి పిలిచారు. ఈ క్రమంలో కేటీఆర్ వారికి సర్ది చెప్పారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని కేటీఆర్ అన్నారు. వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ కోరారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.