TS Minister Errabelli: పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి సుడిగాలి పర్యటన - పైలట్ ప్రాజెక్ట్ శిబిరాల పరిశీలన, త్వరలోనే హెల్త్ ప్రొఫైల్
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 'సందర్శించారు.
TS Minister Errabelli Dayakar Rao: వరంగల్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. కంటి వెలుగు శిబిరాలను, కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాలను పరిశీలిస్తూ, కంటి పరీక్షలు చేసుకుంటున్న వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాలను సందర్శిస్తూ, శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడారు. శిక్షణకు గైర్హాజరైన మహిళలతోనూ శిక్షణకు ఒక్క రోజు కూడా తప్పకుండా రావాలని సూచిస్తూ, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తగిన హామీనిస్తూ, భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మంత్రి ఎర్రబెల్లి. మహాశివ రాత్రి సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కంటికి వెలుగు... ఇంటికి దీపం సిఎం కేసీఆర్ అన్నారు. సగటు పౌరుడికి అవసరమైన అన్నిసదుపాయాలను కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి మనిషి మరణానంతరం వరకు అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజల దృష్టిలోపలను సరవిస్తున్నారని చెప్పారు. కంటిలోపాలు మనకు తెలియకుండానే ఇబ్బందులు పెడతాయని చెప్పారు. అలాంటి లోపాల సవరింపు కోసం ఊరూరా శిబిరాలు పెట్టి, ఉచితంగా పరీక్షలు చేసి, అద్దాలు ఇచ్చి, అవసరమైన శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.
100 పనిదినాలకు 1,500 బృందాలు పని చేస్తున్నాయని, రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి పరీక్షలు మరియు దృష్టి పరీక్షను నిర్వహించడం, కళ్లద్దాలను ఉచితంగా అందించడం, సాధారణ కంటి జబ్బులకు మందులను అందించడం, తీవ్రమైన వికలాంగ కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
త్వరలోనే హెల్త్ ప్రొఫైల్
అలాగే ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని కూడా రెడీ చేస్తున్నామని, ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా ములుగులో చేపట్టి విజయవంతం చేశామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ కంప్యూటరీకరణ చేసి, అత్యవసర పరిస్థితుల్లోనూ నిమిషాల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కుట్టు శిక్షణా కేంద్రాల పరిశీలన
ఇక రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో 5 కోట్ల 10 లక్షల రూపాయలతో 3 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు మంత్రి, రాయపర్తి మండలంలోని రాయపర్తి, పెరికేడు, తొర్రూరు మండలం నాంచారి మడూరు తదితర గ్రామాల్లో కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు. మహిళలు, శిక్షణ ఇస్తున్న శిక్షకులు, నిర్వహిస్తున్న అధికారులతో మంత్రి మాట్లాడారు. శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ పొందే మహిళలతో శిక్షణ ఎలా ఉందంటూ ఆరా తీశారు. శిక్షణకు గైర్హాజరైన మహిళలతోనూ మంత్రి మాట్లాడి కుట్టు శిక్షణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై భరోసా
కుట్టు శిక్షణ అనంతరం ఉపాధి, ఉద్యోగావకాశాలపై కూడా మంత్రి మహిళలకు భరోసానిచ్చారు. శిక్షణ పూర్తయిన తర్వాత వరంగల్ లోని టెక్స్ టైల్ పార్క్ లో అవకాశాలు చాలా ఉన్నాయని, ఇంటి వద్ద నుండి పని చేసుకునే ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలు
పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.
పలువురికి పలకరింపులు, పరామర్శలు
అలాగే నియోజకవర్గంలోని పలు చోట్ల జరిగిన పెండ్లిళ్లు, విందులకు మంత్రి హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అలాగే విందులకు హాజరైన వారి బంధుగణాలను కూడా మంత్రి పలకరించారు. మరికొన్ని చోట్ల బాధాతప్త హృదయులకు పరామర్శలు చేశారు. చనిపోయిన వారికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పారు.
మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై పాలకుర్తిలో సమీక్ష
దేవాలయం, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
మహా శివరాత్రి సందర్భంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఉత్సవాలను ఈ సారి మరింత అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈసారి పాలకుర్తిలో మహా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మరింత బాగా చేయాలని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాలు, దర్శనాలు, శ్రీ సోమేశ్వరస్వామి, అమ్మవార్ల కళ్యాణం, జరిగే ఇతర ఉత్సవాలన్నీ ఘనంగా జరగాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరగాలని అంశాల వారీగా చర్చించారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీకి తగ్గట్లుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడారం జాతర తరహాలో సెక్టోరియల్ అధికారులను నియమించాలని చెప్పారు. ఎలాంటి అవాంఛ నీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు విభాగం వారు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్టీసి బస్సులను మరిన్ని నడపాలని చెప్పారు. దేవాదాయ శాఖ నుంచి మరింత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈ సారి పాలకుర్తిని ఎక్కువ మంది భక్తులు సందర్శించే అవకాశం ఉందన్నారు. సిఎం కెసిఆర్ చొరవతో పాలకుర్తి, బమ్మెర, వల్మీడి లను కలుపుకుని అధ్యాత్మిక కారిడార్ ను ఏర్పాటు చేస్తున్న విషయం బాగా ప్రచారంలో ఉన్నందున భారీ ఎత్తున భక్తులు సందర్శించనున్నారని చెప్పారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి దేవాలయం, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.