Telangana Cloud Bursting: తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ ! కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్
Telangana Cloud Bursting: ఎన్డీయే పాలనలో దేశానికి ప్రధాని తానే అన్న విషయాన్ని మోదీ మరిచిపోతున్నారని, గుజరాత్ తరహాలోనే తెలంగాణలో జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు.
Telangana Cloud Bursting: దేశంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతోందని, విదేశీ వ్యక్తులు సైతం కుట్ర చేస్తున్నారంటూ భద్రాచలంలో ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదైందని, ఊహించని స్థాయిలో వర్షాలు కురిశాయని క్లౌడ్ బరస్ట్ పరిస్థితుల్లో జాతీయ విపత్తుగా ప్రకటించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో భారతదేశానికి ప్రధాని తానే అన్న విషయాన్ని నరేంద్ర మోదీ మరిచిపోతున్నారని, గుజరాత్ ను విపత్తుగా పరిగణించి తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపించడం సరికాదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
బీజేపీ నేతలు రాజకీయం చేయొద్దు..
డిజిస్టర్ సర్వేపై బీజేపీ ఆదిలాబాద్ జిల్లా నాయకులు స్పందించాలని, జిల్లా రైతాంగానికి భరోసా కల్పించాల్సిన సమయంలో బీజేపీ నేతలు రాజకీయాలు చేయోద్దని, డిజిస్టర్ కేంద్ర సర్వేకు పాటు పడేలా ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో రైతాంగం పంటలు పశువులు కరెంటు స్తంభాలు నష్టపోయి రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఇలాంటి సమయంలోనే రైతులకు అండగా నిలవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 871 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసి రైతాంగం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
గుజరాత్‌పై ప్రేమ.. తెలంగాణపై ఎందుకీ కక్ష..!
ఎన్డీయే పాలనలో దేశానికి ప్రధాని తానే అన్న విషయాన్ని మోదీ మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి వరదలు సంభవిస్తే విపత్తుగా పరిగణించి.. తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపించడం సరికాదన్నారు జోగు రామన్న. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 2 ప్రణాళిక బద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు. రైతులకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ నేతల్ని సైతం ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు.
క్లౌడ్ బరస్ట్ అంటే ఇదే..
తక్కువ ప్రాంత పరిధిలో భారీ స్థాయిలో వరదలు రావడాన్ని క్లౌడ్ బరస్ట్ (Cloud Bursting) అంటారు. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో.. ఒకటి నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో భారీ వర్షం పడడడం, పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒకే ప్రాంతంలో ఎన్నిసార్లు అయినా క్లౌడ్ బరస్ట్ జరగొచ్చునని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అది రుతు పవనాల కదలిక, భౌగోళిక, వాతావరణ పరిస్థితి మీద ఆధార పడి ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల తరహాలో దక్షిణాది ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.
Also Read: Cloud Burst : ఒక దేశం మరొక దేశంలో క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? కేసీఆర్ కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్?