T Rajaiah: ఒంటరిగా మారిన రాజయ్య, ఆవేదనతో బీఆర్ఎస్ టికెట్‌పై ఘాటు వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య తన నియోజకవర్గం లింగాలఘనపురం మండలంలో కల్యాణ్ చెక్కులను బుధవారం (ఆగస్టు 30) పంపిణీ చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర మండల స్థాయి నేతలు హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక ఒంటరిగానే చెక్కులు పంపిణీ చేశారు. సదరు స్థానిక లీడర్లు అందరూ మొన్నటిదాకా తన వెంట తిరిగేవారని, తాజాగా అధిష్ఠానం తనకు టికెట్ నిరాకరించడం వల్ల వారంతా తనకు దూరం అయ్యారని అన్నారు. కడియం శ్రీహరికి టికెట్ కన్ఫామ్ అవ్వడం వల్ల తన వెంట ఉన్న ప్రజా ప్రతినిధులు కడియం వర్గానికి జంప్ అయ్యారని అన్నారు.
అయితే, తనకు బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారని, ఎవరూ రారు, ఏదీ కాదని అన్నారు. తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అందరం కలిసి పని చేశామని అన్నారు. మళ్లీ మనం ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఏదో జరగబోయేది ఊహించుకోకండి, అనేక మార్పులు చేర్పులు ఉంటాయని రాజయ్య అన్నారు.
కొద్ది రోజుల క్రితం ఘనపూర్ ఎమ్మెల్యే అయిన రాజయ్యకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. దీంతో అప్పటి నుంచి రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలే కడియం శ్రీహరి అంటే రాజయ్యకు పడదు. ఈ క్రమంలో రాజయ్య కన్నీరు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం ఆయన హన్మకొండ సర్క్యూట్ హౌజ్ మార్గంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన బీఆర్ఎస్ టికెట్ల జాబితాలోనూ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. కేసీఆర్ తనకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తారనే నమ్మకం ఇంకా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మందకృష్ణ మాదిగతో పాటు పలువురు నియోజకవర్గ లీడర్లు తనకు ఫోన్ లో మద్దతు తెలుపుతున్నారని అన్నారు. తనకు ఎన్నికలలోపు టికెట్ కేటాయించకపోతే తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.
తెలంగాణలో ఎస్సీ మాదిగల జనాభా 12 శాతం నుంచి 13 శాతం, మాలలు 5 శాతం నుంచి 6 శాతం, ఇతర ఉపకులాలు 0.7 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటాయని వివరించారు. స్టేషన్ ఘన్ పూర్లో 85 వేల ఎస్సీ జనాభా ఉంటే.. అందులో 67 వేల వరకు మాదిగ కులానికి చెందినవారే ఉన్నారని వివరించారు. టికెట్ మాదిగలకు మాత్రమే కేటాయించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తుందని వివరించారు. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇస్తామంటున్నారని.. కానీ తనకు ఎమ్మెల్యే టికెట్ పై మాత్రమే ఆసక్తి ఉందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు.